సీఈసీ తో ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ ఏమి మాట్లాడారో తెలుసా…

ys jagan
ys jagan

ఓటర్ల జాబితాలో రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందంటూ సీఈసీకి వైసీపీ అధినేత జగన్ వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలోని 3.69 కోట్ల ఓట్లలో దాదాపు 60 లక్షల ఓట్లు డూప్లికేట్ ఓట్ల రూపంలో ఉన్నాయని సీఈసీ దృష్టికి తీసుకువెళ్లారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్‌ అరోరాతో వైసీపీ అధినేత జగ‌న్ భేటీ అయిన అనంత‌రం మీడియాతో మాట్లాడారు. వ్యవస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంత భ్రష్టు పట్టించారో చెప్పడానికి ఇదొక నిదర్శనమన్నారు ఆయ‌న‌.

ఈ 60 లక్షల ఓట్లలో 20 లక్షల ఓట్లు ఏపీ , తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఉన్నాయని తెలిపారు. మిగిలిన 40 లక్షల ఓట్లు ఏపీలోనే నమోదయ్యాయని వివ‌రించారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేశామని వెల్ల‌డించారు జ‌గ‌న్‌. రకరకాల సర్వేల ద్వారా వైసీపీ సానుభూతిపరులను గుర్తించి… వారి ఓట్లను తొలగిస్తున్నారని జగన్ మండిపడ్డారు. పోలీసు, అధికార వ్యవస్థలను చంద్రబాబు ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని అన్నారు.

చంద్రబాబుకు సంబంధించిన సామాజిక వర్గానికి చెందిన పోలీసు అధికారులకు ప్రమోషన్లు ఇస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు కనుసన్నల్లో డీజీపీ పని చేస్తున్నారని… తనపై హత్యాయత్నం జరిగిన గంటలోనే చంద్రబాబు తరపున వకాల్తా పుచ్చుకున్న డీజీపీ మీడియాతో మాట్లాడారని చెప్పారు. డీజీపీతో పాటు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఇంటెలిజెన్స్ ఐజీ వెంకటేశ్వరరావు, లా అండ్ ఆర్డర్ కోఆర్డినేషన్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ లను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని, అప్పుడే ఎన్నికల ప్రక్రియ సజావుగా జరుగుతుందని ఈసీ కి వెల్ల‌డించ‌డం జ‌రిగింద‌న్నారు ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ .