ప్రియాంక పోటీపై కేడర్ లో ఉత్కంఠ

priyanka-gandhi
priyanka-gandhi

సార్వత్రిక ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ దేశవ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ శ్రేణులు మాత్రం ఆమె పోటీ చేయాలని వత్తిడి తెస్తున్నాయి. ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానానికీ చెబుతున్నాయి . కాంగ్రెస్‌ పెద్దలు మాత్రం దీనిపై నోరు మెదపకుండా మౌనం వహిస్తున్నారు. అయితే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందని పార్టీ సీనియర్ లు అంటున్నారు. వారణాసి నుంచి ప్రధాని మోడీ, లక్నోలో కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పోటీ చేస్తున్నారు. వీరిద్దరిలో ఒకరిని ప్రియాంక ప్రత్యర్థి గా ఎంచుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం కాంగ్రెస్‌ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఆమె యూపీలోని ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాలని అక్కడి కేడర్ కోరుతోంది. వారణాసిలో కాంగ్రెస్‌ పార్టీ సామర్థ్యంపై ఇటీవల రహస్య సర్వే ఒకటి నిర్వహించినట్లు సమాచారం. ప్రియాంకను పోటీ చేయించే అంశంపై పార్టీ హైకమాండ్ సమాలోచనలు చేస్తోంది. అందుకే వారణాసి నుంచి అభ్యర్థిని ఇంతవరకు ప్రకటించలేదని అంటున్నారు. ప్రధాని మోడీకి ప్రియాంక మాత్రమే బలమైన ప్రత్యర్థిగా కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ ప్రియాంక పరాజయం అయితే, పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని, గెలిచినా అంతే స్థాయిలో మేలు జరుగుతుందని తర్జన భర్జన పడుతున్నారు.