కాంగ్రెస్ వార్ రూమ్ లో ఏం జ‌రిగింది ..!

Congress party’s war room in Delhi
Congress party’s war room in Delhi

మినీ ఎన్నిక‌ల్లో దూకుడు మీద వున్న కాంగ్రెస్ రానున్న సార్వ‌త్రిక ఎన్న‌క‌ల‌పైనే దృష్టి పెట్టింది. హ‌స్తిన‌లో పార్టీ అధినేత రాహుల్ గాంధీ కాంగ్రెస్‌ వార్ రూమ్ లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో ఏఐసీసీ సమన్వయ కమిటీ సభ్యులైన మల్లికార్జున ఖర్గే, ఏకే ఆంటోనీ, అహ్మద్‌ పటేల్‌, జైరాం రమేశ్ ల‌తో సమావేశమయ్యారు. లోక్‌సభ ఎన్నికలు, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, సన్నద్ధతపై సూచనలు చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రాల్లో ఇతర పార్టీలతో పొత్తులపై ఈ నెల 21వ తేదీలోగా కాంగ్రెస్ ఒక అవ‌గాహ‌న‌కు రానుంద‌ని స‌మాచారం.

ఇటు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపే అంశంపై స్పష్టత లేదని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే లోపే, అన్ని రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పర్యటించాలన్న ప్రతిపాదనపై చర్చ జరిగిందన్నారు. లోక్‌సభ ఎన్నికలకు జాతీయ స్థాయి మేనిఫెస్టో, అసెంబ్లీ ఎన్నికల కోసం రాష్ట్ర స్థాయి మేనిఫెస్టోల రూపకల్పన, ప్రధాని మోదీ వైఫల్యాలపై చార్జిషీటు వంటివి ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేలోపే చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. బూత్‌ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎన్నికల కమిటీతో సహా అన్ని రకాల కమిటీలను ఏర్పాటు చేయాలని అధిష్ఠానం సూచించిందని వివ‌రించారు ర‌ఘ‌వీరా.