ఎన్నిక‌ల ఏడాదిలో మ‌మ‌త తాయిలాలు…!

ముంద‌స్తు ఎన్నిక‌ల్లో విజ‌య ఢంకా మోగించిన తెలంగాణ‌ వైపే ఇప్పుడు అంద‌రి చూపులున్నాయి.ఇక్క‌డ సిఎం కేసీఆర్ అమ‌లు చేసిన సంక్షేమ ప‌ధ‌కాలే ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. మ‌న‌ది వ్య‌వ‌సాయ ప్ర‌ధాన దేశం కావ‌డంతో అంద‌రి చూపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు, రైతు బీమా పథకాల‌పై లుక్ వేశారు.ఇప్ప‌టికే ఈ జాబితాలో రైతుబంధు పథకాన్ని ఒడిశా, జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలు అమ‌లు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాయి. ఇక తాజాగా దేశంలోని కీలక రాష్ట్రంగా ఉన్న పశ్చిమబెంగాల్ కూడా తెలంగాణ బాటలోనే పయనించింది.

రాష్ట్రంలోని 72 లక్షల మంది రైతులకు లబ్ధికూర్చేలా ఏటా ఎకరానికి ఐదువేల ఆర్థికసాయం అందించనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రకటించారు.క్రిషక్ బంధు పేరిట ఈ సాయాన్ని రెండు విడుతల్లో అందించ‌నుంది.2019 జనవరి నుంచి ఈ పథకాన్ని అమల్లోకి తేనున్నారు.మరోవైపు రైతుబీమా పథకం ద్వారా 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న రైతులు ఏ కారణంగా మరణించినా.. రూ.2 లక్షల చొప్పున నష్టపరిహారం బాధిత కుటుంబానికి అందిస్తామని సీఎం మమత అభ‌యం ఇచ్చారు. అదేవిధంగా పంట బీమా ప్రీమియంను ప్రభుత్వమే పూర్తిగా చెల్లిస్తుందని ఆమె తెలిపారు.