ఏపిలో టిడిపి – బిజేపి శ్రేణుల మ‌ధ్య వార్

TDP vs BJP
TDP vs BJP

ఆంద్ర‌ప్ర‌దేశ్ లో తెలుగుదేశం, బిజేపిల మ‌ధ్య వార్ ఉధృత‌మైంది. కాకినాడ‌లో త‌న కాన్వాయ్‌ని బిజేపి అడ్డుకోవ‌డంతో సిఎం చంద్ర‌బాబు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. దీంతో పోలీసులు క‌ల్పించుకుని ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇది ఇంత‌టితో ఆగ‌కుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఇంటి ఎదుట శ‌నివారం టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. కాకినాడలో చంద్రబాబును అడ్డుకోవడంపై టీడీపీ శ్రేణుల ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. మోదీ, కన్నాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అటు బీజేపీ కార్యకర్తలు కూడా పోటీగా ఆందోళనకు దిగారు. కన్నాకు మద్దతుగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒక దశలో టీడీపీ-బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదంతో పాటు తోపులాట జరిగింది. బీజేపీ కార్యకర్తలు టీడీపీ శ్రేణులపై దాడి కూడా చేశారు. ఈ దాడిపై ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసు వ్యవస్థను దిగజార్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిప‌డ్డారు. గుంటూరులో ఆయ‌న మాట్లాడుతూ … సీఎం ఎక్కడికి వెళ్లినా విపక్షాలను గృహనిర్బంధం చేస్తున్నారని విమర్శించారు. కాకినాడలో వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన కార్యకర్తల పట్ల సీఎం అమర్యాదగా ప్రవర్తించారన్నారు. మహిళా కార్పొరేటర్‌ను ఫినిష్‌ చేస్తామని సీఎం అనడం దారుణమన్నారు . సీఎం బెదిరింపులో భాగంగానే టీడీపీ గుండాలు త‌న ఇంటిపై దాడికి దిగారన్నారు. నిన్న‌టివ‌ర‌కు మోదీ , చంద్ర‌బాబు ల మ‌ధ్య మాట‌ల యుద్దం జ‌రిగితే.. ఇప్పుడు కేడ‌ర్ క‌మ్ములాట‌లు ప్రారంభ‌మ‌య్యాయి.