వినయ విధేయ రామ రివ్యూ

Ram Charan

నటీనటులు : రామ్ చరణ్, కియార అద్వానీ, వివేక్ ఒబెరాయ్, ప్రశాంత్, స్నేహ

దర్శకత్వం : బోయపాటి శ్రీను

నిర్మాత : డివివి దానయ్య

సంగీతం : దేవీశ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫర్ : రిషి పంజాబీ – ఆర్థర్ ఏ విల్సన్

ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వర రావు

విడుదల తేదీ : జనవరి 11, 2019

రేటింగ్ : 3/5

రంగస్థలంతో టాలీవుడ్ లో పాత రికార్డులను తిరగరాసిన రామ్ చరణ్ అన్ని జానర్ సినిమాలు చెయ్యాలనే ఉద్దేశ్యంతో మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్ అందించడం కోసం మాస్ స్టైలిష్ స్టైల్ లో బోయపాటి శ్రీను తో జతకట్టాడు. టైటిల్ సాఫ్ట్ గా ఉన్నా… ట్రైలర్ లో పవర్ ఫుల్ కమర్షియల్ ఎంటర్ టైనర్ చూపిస్తామని హామీ ఇచ్చింది చిత్ర యూనిట్. ప్రీ రిలీజ్ ఈవెంట్ తో చిరంజీవి కాన్ఫిడెన్స్, రామ్ చరణ్ యాక్టివ్ నెస్ , బోయపాటి ప్రామిస్ చేసిన ప్రేక్షకులకు ట్రేడ్ వర్గలకు కూడా ఈ సినిమా పై మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. కలెక్షన్స్ కుమ్మేయడమే ఉద్దేశ్యంగా థియేటర్స్ లోకి వచ్చిన వినయవిధేయరాముడు ఆ యాంగిల్ లో ఎంతవరకూ సక్సెస్ అయ్యాడు..? ఓవరాల్ గా ఎలాంటి ఫలితం అందుకున్నాడు అనేది ఇప్పుడు చూద్దాం.

కథ:

నలుగురు అనాథలకు ఒక పసిపిల్లవాడు దొరకుతాడు. అతనికి రామా అని పేరు పెట్టుకుని వాళ్లంతా కలిసి అన్నదమ్ముల్లా పెరుగుతారు. అయితే రామ కి కుటుంబం అంటే అమితమైన ఇష్టం. కుటుంబం జోలికి ఎవరొచ్చినా..విధ్వంసకర రాముడిగా విరుచుకుపడతాడు. రామ్ పెద్దన్నయ్య భువన్ కుమార్ స్ట్రిక్ట్ ఎలక్షన్ కమీషనర్ . అయితే అతనికి బీహార్ లో ఎలక్షన్ డ్యూటీ పడుతుంది. అక్కడికి వెళ్లి ఎలక్షన్ డ్యూటీ వల్ల రాజా సింగ్ అనే నియంత లాంటి విలన్ చేతిలో చిక్కుకుంటాడు. ఆ విషయం తెలిసిన రామ్ అక్కడికి వెళ్లి ఏం చేశాడు..? వాళ్ల అన్నను రక్షించుకున్నాడా లేదా..? రాజా సింగ్ ని ఎలా అంతం చేశాడు అనేది సినిమా చూసి తెల్సుకోవాల్సిందే.

నటీనటులు:

రంగస్థలంతో నటుడిగా, తన సత్తా ఏంటో నిరూపించుకున్న రామ్ చరణ్ కి ఈ సినిమాలోని రామ్ కొణిదెల పాత్ర ..నటుడిగా ఎలాంటి ఛాలెంజ్ ని కూడా ఇవ్వలేకపోయింది. సగటు కమర్షియల్ హీరో పాత్రను తన వరకూ ఎలాంటి పేరు పెట్టడానికి లేకుండా అలవోకగా అంకితభావంతో చేసుకెళ్లిపోయాడు. ఫైట్స్ కోసం కఠోర సాధన చేసి పాటలకోసం అదిరిపోయే స్టెప్స్ వేసి ఫ్యాన్స్ కోసం పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పి డైరెక్టర్ కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి వినయవిధేయరాముడిగా సినిమాను నిలబెట్టడానికి చెయ్యగలిగినంత ప్రయత్నం చేశాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కియారా అద్వానీ గ్లామర్ హీరోయిన్ గా టర్న్ తీసుకుంది. సినిమాకి అవసరమైన మేర అందాల ప్రదర్శనకు ఓకే చెప్పింది. చరణ్ తో ఆమె పెయిరింగ్ పర్ ఫెక్ట్ గా సెట్ అయ్యింది. ఇక వెటరన్ హీరో ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ , అలాగే ఈమద్యే రీఎంట్రీ ఇచ్చన స్నేహ లకు కాస్త ప్రాధాన్యత ఉన్న పాత్రలు దక్కాయి. మధుమిత, రవివర్మ, మధునందన్ , హిమజ, ప్రవీణ వీళ్లంతా చూడచక్కని ఫ్యామిలీలో నిండుదనం తెచ్చారు. ఈ సినిమా కోసం విలన్ గా మారిన బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ నటన పరంగా అలరించినా..పాత్ర పరంగా పెద్దగా ప్రత్యేకత లేకపోవడంతో.. తనదైన ముద్రను వేయలేకపోయాడు. ముఖేష్ రిషి, ఎప్పటిలానే మామూలు విలన్ గా కనిపించాడు. మహేష్ మంజ్రేకర్ పాత్ర కూడా సాధారణంగా ఉంది. పృధ్వి , హేమ లు చేసిన కామెడీ కంటెంట్ నవ్వులు పూయించింది. మిగతా నటీనటులందరూ తమకిచ్చిన పాత్రలను దర్శకుడి ఆలోచనల మేరకు నటించారు.

టెక్నీషియన్స్ :

ఇప్పటి వరకూ మాస్ సినిమాలు తీస్తూ..అలవోకగా విజయాలు అందుకున్న బోయపాటికి ఈ సినిమా అసలైన సవాల్ గా నిలిచింది.రంగస్థలంతో చరణ్ ఇమేజ్ అమాంతంగా పెరగడంతో తన కథలో వయెలెన్స్ పాళ్లు బాగా పెంచాడు బోయపాటి. ఆ క్రమంలో కథ పలచబడిన విషయాన్ని విస్మరించాడు.ఫస్టాఫ్ వరకూ యాక్షన్, సెంటిమెంట్, కామెడీ లను బ్యాలెన్స్ చేసుకుంటూ సాదాసీదా కమర్షయల్ ఎంటర్ టైనర్ లా సినిమాలు నడిపించాడు. సెకండాఫ్ లో మాత్రం ఓవర్ ద టాప్ సీన్స్ ను డిజైన్స్ చేశాడు. హీరో, విలన్ పాత్రలను అత్యంత పవర్ ఫుల్ గా చూపించాలనే తాపత్రయంతో బేసిక్స్ ని వదిలేశాడు. దాని వల్ల సినిమాకి హైలెట్ గా నిలబడాల్సిన ఎపిసోడ్స్.. అయ్యబాబోయ్ అనేలా తయారయ్యాయి. సినిమా వరకూ డైరెక్టర్ గా పూర్తిగా నిరాశపరిచాడనే చెప్పాలి.అసలు రియాలిటీ లో లేని సీన్స్,నిరాటంకముగా,సుదీర్ఘంగా ఉన్న ఫైట్స్ ఒక దశ దాటాక విసుగు తెప్పించాయి.హీరోయిజాన్ని ఎక్కువ ఎలివేట్ చెయ్యాలని చూసి మరీ పేలవమైన సీన్స్ రాసుకున్న బోయపాటి కనీసం ఫైనల్ కట్ చూసాక అయినా అవి పేలవు అని గ్రహించలేకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది.రుషి పంజాబీ, ఆర్దర్ విల్సన్ ల సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్ లో ఉంది. సినిమా అంతా రిచ్ లుక్ రావడానికి వీళ్లు ఎంతగానో సహకరించారు. అజర్ బైజాన్ ఎపిసోడ్స్ లో ఏరియల్ షాట్స్ ఆకట్టుకున్నాయి. సినిమాలో కంటెంట్ సో..సో..గా ఉండడంతో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న దేవీశ్రీప్రసాద్ కూడా నార్మల్ ట్యూన్స్ మాత్రమే డెలివర్ చెయ్యగలిగాడు. ఆర్.ఆర్ లో మాత్రం దేవీ ట్రేడ్ మార్క్ అక్కడక్కడా కనిపించింది. డైలాగ్ రైటర్ రత్నం పవర్ ఫుల్ డైలాగ్స్ వరకూ తన పెన్ పవర్ చూపించాడు. ఈ సినిమాలో ఫైట్ మాస్టర్స్ కష్టం స్క్రీన్ మీద కనిపిస్తుంది. యాక్షన్ ఎపిసోడ్స్ కొంత మేరకు ఆకట్టుకున్నాయి. డి.వి.వి దానయ్య నిర్మాణ విలువలకు తిరుగులేదు. అడుగడుగునా గ్రాండియన్ కనిపించేలా ఈ సినిమాని నిర్మించారు.

ఫైనల్

భారీ ఎక్స్ పెక్టేషన్స్ మద్య కమర్షియల్ ఎంటర్ టైనర్ గా థియేటర్స్ లోకి వచ్చిన వినయవిధేయరాముడు.. సినిమాలో మాత్రం వీర విధ్వంసకర రాముడిగా రెచ్చిపోయాడు. ఫస్టాఫ్ వరకూ ఓకే అనిపించినా.. సినిమా రెండో భాగం గతి తప్పింది. యాక్షన్ ఎపిసోడ్స్ ని ఎక్కువగా కుమ్మరించడంతో.. ఫ్యాన్స్ కు కనెక్ట్ అయినా.. కామన్ ఆడియన్స్ కి మాత్రం సో సో గా అనిపించవచ్చు. పండగ సీజన్ కావడం వల్ల బాక్సాఫీస్ వద్ద బాగానే పర్ఫామ్ చేసే అవకాశాలు ఉండొచ్చు.