మహర్షి అద్భుతం.. మహేష్ నటన భేష్.. వెంకయ్య నాయుడు

Venkaiah Naidu
Venkaiah Naidu

వరుస పెట్టి మెస్సేజ్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ సమాజం పట్ల, సామాజిక అంశాల పట్ల తనకున్న ఇష్టాన్ని చాటుకుంటున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో ఎంతో విలువలతో కూడిన సందేశాన్నిచ్చారు. దీంతో మహేష్ అభిమానులతో పాటు దేశంలోని సినీ తారలు, పొలిటిషన్స్ మహేష్‌ని మెచ్చుకుంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఇప్పటికే మహర్షి సినిమాను ప్రశంసిస్తూ పలువురు స్టార్స్ తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చగా తాజాగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సోషల్ మీడియా వేదికగా మహర్షి సినిమాపై తన స్పందనను తెలిపారు. వివరాల్లోకెళితే..

మహర్షి సినిమాకు వస్తున్న టాక్ విని కుటుంబంతో కలిసి సినిమా కెళ్ళానని ఆయన తెలిపారు. ఇది ఎంతో అద్భుతమైన చిత్రమని, చిత్రంలో మహేష్ నటన భేష్ అని ఆయన పొగిడారు. సహజమైన నటనతో మహేష్ చక్కని ప్రతిభ కనబర్చారని అన్నారు. రైతు నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వ్యవసాయ ప్రాధాన్యతను గుర్తు చేశారని పేర్కొంటూ ట్వీట్స్ పెట్టారు వెంకయ్య నాయుడు.

గ్రామీణ ప్రజల సౌభాగ్యాన్ని, వ్యవసాయ ప్రాధాన్యతను వివరిస్తూ అన్నదాత ఆవశ్యకతను తెలిపిన ప్రభోదాత్మక చిత్రం మహర్షి అని ఆయన కొనియాడారు. ప్రతీ ఒక్కరూ చూడదగిన మంచి సినిమా ఇదని తెలుపుతూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు వెంకయ్య నాయుడు.