కోల్ కతాలో బీజేపీయేతర పక్షాల ఐక్యతా ర్యాలీ విజ‌య‌వంతం

United India Rally
United India Rally

కోల్‌కతా బ్రిగేడ్‌ మైదానం జనంతో కిక్కిరిసింది. తృణమూల్‌ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విపక్షాల ఐక్య ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో 20 మంది జాతీయ స్థాయి నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ నేత మ‌ల్లిఖార్జ‌న ఖ‌ర్గే ,ఎన్సీపి నేత శ‌ర‌ద్ ప‌వార్ , సీఎం చంద్రబాబు, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్‌, డీఎంకే నేత స్టాలిన్, దేవెగౌడ, శరద్‌యాదవ్‌, కేజ్రీవాల్‌, ఫరూక్‌ అబ్దుల్లా, ఒమర్‌ అబ్దుల్లా, శత్రుజ్ఞసిన్హా ర్యాలీలో పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల ముందు మోదీ సర్కారుపై విపక్ష కూటమి సమర భేరీ మోగించారు.

యునైటెడ్‌ ఇండియా బ్రిగేడ్ పేరిట జ‌రిగిన స‌భ‌లో మమతతోపాటు పలువురు నాయకులు ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం రైతులను దారుణంగా మోసం చేస్తోందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కోల్‌కతాలో యూనిటీ ర్యాలీలో ఆయ‌న మాట్లాడారు. రైతుల కష్టనష్టాలు కేంద్ర ప్రభుత్వానికి పట్టవని ఆయన చెప్పారు. రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆయన విమర్శించారు. ఆర్థిక వ్యవస్థతో కూడా కేంద్రం రాజకీయం చేసిందని ఆయన అన్నారు.

పెద్ద నోట్ల రద్దే దానికి నిదర్శనమని చంద్రబాబు చెప్పారు. బిజెపి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటే తాము ఏకం చేయాలనుకుంటున్నామని ఆయన అన్నారు. స్వాతంత్య్ర సంగ్రామానికి పశ్చిమ బెంగాల్‌ దశ, దిశ చూపిందని ఆయన అన్నారు. ప్రతిపక్షాల ఐక్యతకు ఇంత మంచి వేదిక ఏర్పాటు చేసినందుకు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కృతజ్ఞతలని ఆయన అన్నారు. బ్రిగేడ్‌ పరేడ్ మైదానంలో జరిగే ఈ ర్యాలీలో ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌లు హాజ‌ర‌య్యారు.