టి ఆర్ ఎస్ పార్టీ సింబ‌ల్ రీ డిజైన్ ఎందుకో తెలుసా

TRS Party Symbol
TRS Party Symbol

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌య‌ప‌ధంలో దూసుకుపోయిన కారుకు అక్క‌డ‌క్క‌డా కాస్త మెజారిటీ త‌గ్గింది. ఎందుకా అని టి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఆరా తీయ‌గా విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ట్రక్కు, రైతుతో కూడిన ట్రాక్టర్, ఇస్త్రీ పెట్టె, కెమెరా వంటి ఎన్నికల గుర్తులు టీఆర్‌ఎస్‌ ఎన్నికల చిహ్నమైన కారు గుర్తును పోలి ఉన్నాయని తేలింది.

ముఖ్యంగా సమాజ్‌వాదీ ఫార్వార్డ్‌ బ్లాక్‌ పార్టీకి కేటాయించిన ట్రక్కు గుర్తు ఓట‌ర్ల‌ను అయోమ‌యానికి గురిచేసింద‌ని తెలిసింది. దీంతో టీఆర్‌ఎస్‌కు కేటాయించిన ఎన్నికల చిహ్నం కారు బ్యాలెట్‌ పేపర్‌పై సరిగా కనిపించడం లేదని గతేడాది డిసెంబర్‌ 27న ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ఎన్నికల సంఘానికి విన్నవించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కారు గుర్తును రీడిజైన్‌ చేసి సమర్పించాలని సూచించింది.

కేంద్ర ఎన్నికల సంఘం సూచన మేరకు టీఆర్‌ఎస్‌ పార్టీ రీడిజైన్‌ చేసిన కారు లోగోను సమర్పించామ‌ని ఎంపీ వినోద్‌కుమార్ వెల్ల‌డించారు. ఓటర్లకు సులువుగా కారు గుర్తు కనిపించేలా రీడిజైన్‌ చేసి సీఈసీకి సమర్పించినట్లు ఆయ‌న తెలిపారు. అయితే ముఖ్యమంత్రి చేసిన ఇతర వినతులను పట్టించుకోలేదని తాజాగా సీఈసీకి రాసిన లేఖలో వివ‌రించారు ఎంపి వినోద్ .