ఎన్నికల సమర భేరిని మోగించిన గులాబీ దళం

KTR
KTR

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పార్గమెంట్ ఎన్నికల సమర భేరీ మోగించింది. కరీంనగర్ జిల్లాలోని శ్రీ రాజరాజేశ్వరీ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మా తెలంగాణ మాకు కావాలని కరీంనగర్ గర్జించిందన్నారు ఆయన. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు గొప్ప తీర్పు ఇచ్చారన్నారు.

ఈ ఎన్నికల్లో 88 సీట్లు, 50 శాతం ఓట్లతో తమ అధినేత కెసిఆర్‌ను గెలిపించారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కరీంనగర్‌తో ఎంతో అనుబంధం ఉందన్నారు కేటీఆర్. సిఎం కెసిఆర్ ఏ పని ప్రారంభించినా ఇక్కడినుంచే ప్రారంభిస్తారన్నారు. కరీంనగర్ గడ్డ మీద ఏ పని ప్రారంభించినా దిగ్విజయంగా పూర్తవుతుందని కేసీఆర్‌కు విశ్వాసం ఉందన్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని కేటీఆర్ కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఇస్తున్న అన్ని పెన్షన్లను రెట్టింపు చేస్తున్నామని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ చెప్పారు. తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ఆయన వివరించారు.