కేంద్రంలో కీలక శక్తిగా టి ఆర్ ఎస్ – కేటీఆర్

KTR
KTR

కేసీఆర్ ఆలోచనలే ఇవాళ దేశానికి ఆచరణగా మారాయన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నాగర్‌ కర్నూల్‌ పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. . సిఎం కేసీఆర్ స్వయంగా రైతు అయినందువల్లే రైతు సంక్షేమ పథకాలపై ఎక్కువ దృష్టి పెట్టారన్నారు. వ్యవసాయం దండగన్న చంద్రబాబు ఇవాళ మన రైతుబంధు పథకాన్ని కాపీ కొట్టారన్నారు. మన రైతుబంధు పథకాన్ని పేరు మార్చి కేంద్రం అమలు చేస్తోందన్నారు . కేసీఆర్ ఆలోచనలనే చాలా మంది ముఖ్యమంత్రులు అనుసరిస్తున్నారన్నారు. ఏప్రిల్ నెల నుంచి పింఛన్ రెట్టింపు చేసి రూ.2 వేలు ఇస్తామని కేటీఆర్ ప్ర‌క‌టించారు. 43 లక్షల మందికి ఆసరా పింఛన్లు ప్రభుత్వం ఇస్తుంద‌న్నారు. ఈసారి నాగర్‌కర్నూల్‌లో గులాబీ జెండా ఎగరడం ఖాయ‌మ‌న్నారు ఆయ‌న‌.

పాలమూరు పచ్చబడుతుంటే ప్రతిపక్షాల క‌ళ్లు ఎర్రబడుతున్నాయ‌న్నారు. మూడేళ్లలోనే ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లు ఇస్తుంటే కాంగ్రెస్‌ నేతలకు నిద్రపట్టడం లేద‌న్నారు. ఐదేళ్ల క్రితం భారీ మెజార్టీతో ప్రజలు గెలిపిస్తే మోదీ చేసింది శూన్య‌మేన‌ని కేటీఆర్ వివ‌రించారు. పోలవరానికి జాతీయహోదా ఇచ్చిన కేంద్రం కాళేశ్వరానికి ఎందుకు ఇవ్వలేద‌ని నిల‌దీశారు ఆయ‌న‌. భావసారుప్య పార్టీలతో కలిసి కేంద్రంలో కీలకశక్తిగా మారుతామ‌న్నారు. ఢిల్లీ గద్దెను ఎక్కేది ఎవ‌రో టీఆర్‌ఎస్‌ నిర్ణయించాలని కేటీఆర్‌ వివరించారు. ఈ స‌మావేశంలో మంత్రులు నిరంజ‌న్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యేలు, ప్ర‌జాప్ర‌తినిధులు త‌దిత‌రులు పాల్గొన్నారు.