ట్రిపుల్ త‌లాక్ పై పెద్ద‌ల స‌భ‌లో ర‌గ‌డ

Triple Talaq

ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చ ప్రారంభం కాకుండానే రాజ్య‌స‌భ వాయిదాల ప‌ర్వంలో ప‌డింది. ప్ర‌తిపక్షాల అభ్యంతరాలను పట్టించు కోకుండానే లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును నెగ్గించుకోంది.రాజ్యసభలో మాత్రం ప్రతిపక్షాల బలం అధికంగా ఉండడంతో..ఇది గట్టెక్కుతుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది.కాగా ఈ బిల్లును జాయింట్ సెలక్షన్ కమిటీకి పంపాల్సిందేనని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు పట్టుపడుతున్నాయి.ఈ మేరకు చేసిన తీర్మానంపై ఇప్పటికే 11 పార్టీలు సంతకాలు చేశాయి.ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చకు ముందు ఈ తీర్మానంపై ఓటింగ్ జరపాలని కూడా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఇవాళ ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చ ప్రారంభం కాకుండానే ప‌లుమార్లు స‌భ వాయిదా ప‌డింది.సభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.విపక్ష సభ్యుల గందరగోళం మధ్య సభ వాయిదా పడింది.తిరిగి జనవరి 2వ తేదీన సభ సమావేశమవుతుంది.త్రిపుల్‌ తలాఖ్‌ బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపించాలని ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకగ్రీవంగా డిమాండ్‌ చేశాయి.ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్‌ మాట్లాడుతూ..బిల్లును సెలెక్ట్‌ కమిటీ పంపించాలని ఆయన డిమాండ్‌ చేశారు.బిల్లుపై ఎలాంటి చర్చకైనా సిద్ధమేనని న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ చెప్పారు.కానీ ముందుగా బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపాలంటూ తాము ఇచ్చిన తీర్మానంపై చర్చ జరగాలని ఆజాద్‌ డిమాండ్‌ చేశారు.