తెలంగాణ‌లో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌

Telangana vote on account Budget
Telangana vote on account Budget

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ఆర్నెళ్ల కాలానికి ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2019-20 సంవత్సరానికి బడ్జెట్ ను 1,82,017 కోట్ల రూపాయలతో ప్రవేశ పెట్టారు ఆయ‌న‌. రెవెన్యూ వ్యయం రూ.1,31,629 కోట్లు కాగా, మూల ధన వ్యయం 32, 815 కోట్లుగా వెల్ల‌డించారు. రెవెన్యూ మిగులు 6,564 కోట్ల రూపాయలు వుండ‌గా…ఆర్ధిక లోటు 27, 749 కోట్ల రూపాయలుగా బడ్జెట్ ప్రతిపాదనల్లో అంచనా వేశారు.

2018-19లో తెలంగాణ వృద్ది రేటు 15శాతం ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడడానికి రెండేళ్ల ముందు జీఎస్ డీపీ దేశ సగటు కన్నా తక్కువగా ఉందన్నారు సిఎం కేసీఆర్ . సేవల రంగంలో 15.5శాతం వృద్దిరేటు ఉంటుందని ఆశిస్తున్నామన్నారు. తక్కువ సమయంలో అత్యధిక సంక్షేమ, అభివృద్ధిపథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత టి ఆర్ ఎస్ సర్కార్ దేనన్నారు సిఎం.కేసీఆర్ తన మధ్యంతర బడ్జెట్ లో రైతు బంధు సాయం పది వేల రూపాయలకు పెంచారు.

ఇందు కోసం బడ్జెట్ లో రూ.12 వేల కోట్లు కేటాయించారు. రైతు రుణ మాఫీ కోసం 6 వేల కోట్ల రూపాయిలు కేటాయిస్తున్నట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రైతు రుణ మాఫీ అమలు చేశామని వివ‌రించారు సిఎం కేసీఆర్‌. దురదృష్ట వశాత్తు రైతు మరణిస్తే రైతు బీమా పథకం కింద 5 లక్షల రూపాయ‌ల నష్టపరిహారం చెల్లిస్తామనీ, ఇందుకోసం బడ్జెట్ లో 650 కోట్లు కేటాయించామన్నారు కేసీఆర్.

రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ, మరమ్మతుల కోసం ఉద్దేశించిన మిషన్ కాకతీయ పథకానికి 22 వేల 550 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. అలాగే మిషన్ కాకతీయ ద్వారా 20,171 చెరువులను పునరుద్దరణ చేస్తున్నట్లు తెలిపారు. కొత్తగా 22.50 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములను నిర్మించామని వివ‌రించారు సిఎం.బడ్జెట్ లో మైనార్టీల సంక్షేమానికి 2 వేల 400కోట్ల బడ్జెట్ ను కేటాయించారు.

చేనేత కార్మికులకు నెలకు 15 వేల రూపాయిల వేతనం లభించే విధంగా చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీలో వెల్ల‌డించారు.రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు,బోధకాల బాధితులు, నేత, గీతా కార్మికులు, ఎయిడ్స్ వాధి గ్రస్థులకు ఇచ్చే నెలసరి పెన్షన్ మొత్తాన్ని వెయ్యి రూపాయ‌ల నుంచి 2 వేల 16 రూపాయ‌ల‌కు పెంచుతున్నట్లు వివ‌రించారు సీఎం కేసీఆర్.

అదేవిధంగా దివ్యాంగుల పెన్షన్ రూ. 1500 నుంచి రూ. 3,016కు పెంచుతున్నట్లు వెల్లడించారు. వృద్ధాప్య పెన్షన్‌కు కనీస అర్హత వయస్సు 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించి పెరిగిన పెన్షన్ అందిస్తామని ప్రకటించారు ముఖ్య‌మంత్రి.ఎన్నికల హామీల్లో భాగంగా నిరుద్యోగులకు రూ. 3016 భృతి ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దీనికి సంబంధించి తాజా తాత్కాలిక బడ్జెట్‌లో రూ.1810 కోట్లు కేటాయించినట్లు కేసీఆర్ వెల్లడించారు.