తెలంగాణ‌లో ప‌త్తాలేని ప్ర‌జా ఫ్రంట్ ..?

mahakutami

అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో చావుదెబ్బ తిన్న ప్ర‌జా ఫ్రంట్ ( మ‌హా కూట‌మి ) ఇప్పుడు ప‌త్తా లేకుండా పోయింది. తెలంగాణ‌లో ప్రజా ఫ్రంట్‌ కొనసాగింపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఫలితాలు వెలువడి నెల రోజులు దాటినా కూటమి ఓట‌మిపై క‌ల‌సి సమీక్ష కూడా నిర్వ‌హించుకోలేక పోయింది. కనీసం మిత్రపక్షాల నేత లు వ్యక్తిగతంగా కలుసుకుని పరస్పరం అభిప్రాయాలు పంచుకునేందుకు ప్రయత్నించిన దాఖలాలు కూడా కాన‌రాకుండా పోయాయి. అయితే కూటమికి సార‌ధ్యం వహించిన పార్టీగా కాంగ్రెస్‌ సొంతంగా కొంత ఆలస్యంగానే ఫలితాలపై సమీక్ష నిర్వహించుకుని త‌మ హై క‌మాండ్ కు నివేదిక పంపించింది.

టీఆర్‌ఎస్‌ మెజారిటీ స్థానాల్లో గెలుపొందడంపై స్పష్టమైన కారణాలు, దారి తీసిన పరిస్థితులను మాత్రం పూర్తిస్థాయిలో ఇంకా అంచనా వేయలేకపోయిందనే విమ‌ర్శ‌లున్నాయి. అయితే ఫ్రంట్‌ వల్ల పార్టీకి నష్టం జరిగిందని, ఒంటరిగా పోటీ చేసుంటే మెరుగైన ఫలితాలొచ్చి ఉండేవని కాంగ్రెస్‌లోని ఒక వర్గం వాదిస్తోంది. కూటమిని ఇక ముందు కూడా కొనసాగిస్తామని రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి కుంతియా, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ సంకేతాలైతే ఇచ్చారు. కానీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో భవిష్యత్‌లో ఈ కూటమి కొనసాగుతుందా లేదా అన్న సందేహాలు కేడ‌ర్ లో తలెత్తుతున్నాయి.

తెలంగాణ‌లో పంచాయితీ స‌మ‌రం ప్రారంభ‌మై తొలి విడ‌త నామినేష‌న్ ల ప‌ర్వం కూడా ముగిసిపోయింది. ఈ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతున్నా గ్రామ స్థాయి ల్లో పార్టీలు పరస్పరం సహకరించుకుంటే మంచి ఫలి తాలు వచ్చే అవకాశాలు వున్నాయి. అయితే ఈ దిశ‌గా ప్ర‌జా ఫ్రంట్ లోని పార్టీలు ఏ మాత్రం ప్ర‌య‌త్నం చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. కనీసం క్షేత్రస్థాయిలో ఈ పార్టీల మధ్య అవసరమైన మేర అవగాహన కోసం ప్రయత్నాలు కూడా జరగలేదు. లోక్‌సభ ఎన్నికలకు ముందు మళ్లీ కూటమి కుదురుకోవడానికి, పరస్పరం ఇచ్చి పుచ్చుకునే ధోరణికి పంచాయతీ ఎన్నికలు ఒక అవకాశం అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. దీంతో కూటమి కొనసాగింపు కష్టమేననే చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సాగుతోంది.