ఐటీ గ్రిడ్స్ కార్యాలయం సీజ్

ITGrids Office
ITGrids Office

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపిన హైద‌రాబాద్ మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో ఐటీ గ్రిడ్స్ కార్యాలయాన్ని అధికారులు సీజ్‌ చేశారు. డేటా చోరీ కేసులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృం దం (సిట్‌) విచారణ వేగవంతం చేసింది. ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర నేతృత్వంలో అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.ఇందులో వున్న హార్డ్‌ డిస్క్‌ను పోలీసులు గ‌తంలోనే స్వాధీనం చేసుకు న్నారు.కార్యాలయంలో మిగిలిన కంప్యూటర్లను స్వాధీనం చేసుకుని సీల్‌ వేశారు. ఆఫీసు వద్దకు ఇతరులెవరూ రాకుండా పోలీసు బందోబస్తు ఏర్పా టు చేశారు. ఐటీ గ్రిడ్స్‌ సంస్థ నుంచి స్వాధీనం చేసుకున్న హార్డ్‌ డిస్క్‌ డేటాను బెంగళూరుకు చెందిన ఐటీ నిపుణులు, ఎథిక్‌ హ్యాకర్స్‌ సాయంతో విశ్లేషిస్తున్నారు పరారీలో ఉన్న ఐటీ గ్రిడ్స్‌ సంస్థ సీఈఓ అశోక్‌ని అరెస్ట్‌ చేసేందుకు సిట్‌ అధికారులు గాలిస్తున్నారు. మ‌రోవైపు ఐటీగ్రిడ్‌ కేసులో కొత్త ట్విస్టు చోటు చేసుకుంది. ఈ కేసులో తన పేరును తొలగించాలంటూ కేసులో కీలకంగా భావిస్తున్న ఐటీ గ్రిడ్‌ సీఈఓ అశోక్‌ హైకోర్టును ఆశ్రయించారు . క్వాష్‌ పిటిషన్‌ వేసిన అశోక్‌ ఐటీ గ్రిడ్‌ కేసులో తన పేరును పోలీసులు అనవసరంగా ఇరికించారని, తొలగించేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఇదిలా ఉండగా తెలంగాణ సిట్‌ కార్యాలయాన్ని మార్చారు. డీజీపీ ఆఫీసు నుంచి గోషామహల్‌ చీఫ్‌ సెక్యూరిటీ వింగ్‌ కార్యాలయంలోకి మార్చారు.