తెలంగాణ‌లో కేబినెట్ విస్త‌ర‌ణ‌పై గంపెడాశ‌లు

TRS Party

తెలంగాణ‌లో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌పై ఎమ్మెల్యేలు గంపెడాశ‌లు పెట్టుకున్నారు. ఎవ‌రెవ‌రికీ ఏ యో బెర్తులు ద‌క్క‌నున్నాయ‌నేది ఇప్పుడు ఉత్కంఠ‌గా మారింది. దీనిపై ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేప‌ధ్యంలోనే ఈనెల 17 నుండి అసెంబ్లీ కార్యకలాపాలు జరగనున్నాయని ప్రకటించారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక అన్నిటికి తేదీలను ఖరారు చేశారు. వీటితో పాటే మంత్రివర్గ విస్తరణ కూడా ఉండవచ్చని అంద‌రూ భావిస్తున్నారు. వీటికి బలం చేకూరుస్తూ సిఎం కెసిఆర్ మంత్రివర్గం ఇదే అంటూ పార్టీలో చర్చ మొదలయింది .

ముఖ్యంగా స్పీకర్ నియామకం, మంత్రి వర్గంపై కొందరి పేర్లు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీకి రెండవ స్పీకర్ గా ఈటెల రాజేందర్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఈటెల, వరంగల్ జిల్లా సీఎం పర్యటనలో స్పీకర్ పదవి విముఖత చూపించారని తెలిసింది. ఒకవేళ ఈటెల కాకపోతే స్పీకర్ పదవి పోచారం శ్రీనివాసరెడ్డిని వరిస్తుందని చెబుతున్నారు.ఇటు పాత కెసిఆర్ క్యాబినెట్ లో ఉన్న నాయని నరసింహారెడ్డి, కడియం శ్రీహరి పేర్లు రాబోయే మంత్రివర్గంలో వినిపించడంలేదని ముందుగా మరో ఆరుగురితో మంత్రివర్గ విస్తరణ జరగనుందని సమాచారం.ముఖ్యంగా ఎర్రబెల్లికి కేబినెట్ లో చోటు దక్కడం ఖాయమంటున్న టి ఆర్ ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

వేముల ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ లకు మంత్రివర్గంలో ఛాన్స్ దక్కే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇక మహిళల కోటాలో పద్మా దేవేందర్ రెడ్డి, గొంగిడి సునీత, రేఖానాయక్ మంత్రి పదవులపై గట్టి ఆశలు పెట్టుకున్నారు. అయితే ముందుగా ఒకరికే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. పార్టీ సీనియ‌ర్ల జాబితాలో ఉన్న హరీష్ రావు, కేటీఆర్ లకు కూడా తొలి విస్తరణలోనే అవకాశం దక్కనున్నట్లుగా విస్తృత ప్రచారం జరుగుతుంది.