సంస్థాగత ప‌ద‌వుల‌పై దృష్టి పెట్టిన తెలంగాణ కాంగ్రెస్

Telangana Congress Party
Telangana Congress Party

తెలంగాణ‌లో అధికారంలోకి వ‌స్తామ‌న్న కాంగ్రెస్ క‌ల‌లు క‌ల‌గానే మారాయి. నాయ‌కులు ఈ ప‌రాభ‌వం నుంచి తేరుకునే లోపే స్థానిక స‌మ‌రం స్ఠార్ట్ అయింది. దీంతో వీరిలో తిరిగి జ‌వ‌స‌త్వాలు నింపేందుకు కాంగ్రెస్ హై క‌మాండ్ టానిక్ ఇచ్చింది.తెలంగాణలోని 31 జిల్లాల్లో డిసిసిల అధ్యక్షులను నియమించాలని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌ను ఆదేశించారు.మండల కమిటీలు, బ్లాక్‌కమిటీలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.ఈ నెల 10లోగా సంస్థాగతంగా పార్టీ పదవులను భర్తీ చేయాలని ఆయన ఆదేశించారు.

అసెంబ్లికి పోటీ చేసిన అభ్యర్థులే పంచాయతీ, లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యేవరకూ ఆయా నియోజక వర్గాలకు ఇన్‌ఛార్జులుగా వ్యవహరించాలని అన్నారు.తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని రానున్న ఎన్నికలకు సమాయత్తం చేయాలని పిలుపునిచ్చారు. కొత్తగా 15 మందితో ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ ఏర్పాటు చేస్తామని, లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి పార్టీ శ్రేణుల మనోధైర్యాన్ని దెబ్బ తీయదని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. జాతీయ అంశాలే ప్రాతిపదికన జరిగే లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్య‌క్తం చేశారు.

ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ కుంతియా, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు.రాష్ట్రంలోని మండల, బ్లాక్ కమిటీలను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయ తీసుకున్నట్లు ఉత్తమ్ తెలిపారు. జనవరి 10వ తేదీలోగా సంస్థాగతంగా పార్టీ పదవులను భర్తీ చేయాలని రాహుల్ గాంధీ ఆదేశించినట్లు స్పష్టం చేశారు.