సిఎల్‌పి రేసులో హేమాహేమీలు

Telangana Congress Party

తెలంగాణ కాంగ్రెస్ శాస‌న‌స‌భాప‌క్ష నేత ప‌ద‌వికి ఆ పార్టీ నుంచి హేమాహేమీలు పోటీప‌డుతున్నారు. అధికారంలోకి వ‌స్తామ‌ని భంగ‌ప‌డ్డ నేత‌ల‌కు ఇప్పుడు సిఎల్‌పి నేత ప‌ద‌వి అంద‌ని ద్రాక్ష పండుగా మారింది. స‌భ‌లో టిఆర్ ఎస్ ను బ‌లంగా ఎదుర్కొనే నాయ‌కునిపై కాంగ్రెస్ హైక‌మాండ్ దృష్టి పెట్టింది. ఈ నెల 17 నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎల్పీ నేత ఎంపికపై అధిష్ఠానం క‌స‌ర‌త్తులు చేస్తోంది. సంక్రాంతి పండగ మరసటి రోజు అంటే ఈ నెల 16న సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేసి.. అదే రోజున సీఎల్పీ నేతను ఎంపిక చేసేందుకు ప్లాన్ చేస్తోంది.ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సమక్షంలో సీఎల్పీ నేత ఎంపిక జరగనుంది.

సీఎల్పీ సమావేశం 16న కుదరకపోతే 17న ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.సీఎల్పీ నేతగా టీపీసీసీ ప్రచార కమిటీ అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. డిప్యూటీ స్పీకర్‌గా, చీఫ్‌ విప్‌గా పని చేసిన భట్టికి సభా వ్యవహారాలపై పట్టు ఉందంటున్నారు. దీంతో పాటు సామాజిక నేపథ్యమూ కలిసి వస్తుంది ఆయ‌న‌కు. సీఎల్పీ నేత రేసులో మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు శాసనసభ వ్యవహారాల మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. ప్రభావిత వర్గమైన బ్రాహ్మణ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని అధిష్ఠానం భావిస్తే శ్రీధర్‌బాబుకు చాన్స్‌ దక్కవచ్చని అంటున్నారు.ఇటు మరో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సైతం సీఎల్పీ నేత పదవిని ఆశిస్తున్నట్లు చెబుతున్నారు.

టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగుతున్న నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన సబితా ఇంద్రారెడ్డిని పరిగణనలోకి తీసుకుంటారా అన్నది ప్రశ్నార్థకంగా ఉంది. ఇక ఇదే సామాజిక వర్గానికే చెందిన ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డిలు కూడా తాము సీఎల్పీ నేత రేసులో ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించారు. వీరిలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఆయ‌న ఎంపీగా, ఎమ్మెల్సీగా పని చేసినా.. ఎమ్మెల్యేగా ఎన్నికవడం ఆయనకిదే తొలిసారి. శాసనసభ వ్యవహారాలపై పట్టును పరిగణనలోకి తీసుకుంటే ప్రధాన పోటీ భట్టివిక్రమార్క, శ్రీధర్‌బాబుల మధ్యే ఉంటుందని రాజ‌కీయ వ‌ర్గాలు భావిస్తున్నాయి.