నీళ్లందించకుంటే పాపం మూట‌గ‌ట్టుకున్న‌ట్లే – సిఎం కేసీఆర్

KCR
KCR

ప్రాజెక్టుల ద్వారా నీళ్లొస్తున్నాయి.. పనులు చేయడానికి నిధులు ఇస్తున్నాం.. అయినప్పటికీ పంట పొలాలకు నీళ్లందించకుంటే పాపం చేసిన వారమవుతాం అని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రగతిభవన్‌లో ఆయ‌న ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలోని ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు.

ప్రాజెక్టు పరిధిలోని మొత్తం ఆయకట్టుకు నీరందించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్నదో గుర్తించి అప్పటికప్పుడే పరిష్కరించాల‌ని ఆదేశించారు సిఎం కేసీఆర్‌. ఈ వానకాలం సీజన్‌లోనే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని మొత్తం 14.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు కాళేశ్వరం నీళ్లు అందించాలన్నారు.

జూన్ నాటికే కాల్వలు, తూముల నిర్మాణం, లైనింగ్ పనులు పూర్తిచేయాలన్నారు. పలు ప్రాజెక్టులు, కాల్వల పనులను వేగ‌వంతం చేయాలన్నారు సీఎం కెసిఆర్. భూసేకరణకు, ఇతర పనులకు కావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆర్థికశాఖను ఆదేశించారు.పాలకుర్తి, ఉప్పుగల్లు, చెన్నూరు రిజర్వాయర్ల నిర్మాణానికి టెండర్లు పిలవాలన్నారు సిఎం కేసీఆర్‌.