కేబినెట్ కూర్పుపై సిఎం కేసీఆర్ క‌స‌ర‌త్తులు

KCR

మాఘ‌మాసం రావ‌డంతో మంచి ముహూర్తం రోజున కేబినెట్ ను విస్త‌రించేందుకు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. కొత్తగా మరో 13 మందిని చేర్చుకునేందుకు వ్యూహ‌ర‌చ‌న చేస్తున్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో పాటు హోం మంత్రి మహమూద్‌ అలీ ప్రస్తుతం పని చేస్తున్నారు. మరో పదమూడు మందిని కేబినెట్ లోకి తీసుకుంటే కేసీఆర్‌ అదృష్ట సంఖ్య ఆరు కుదురుతుంద‌ని లెక్క‌లు వేస్తున్నారు. ఇప్పుడున్న ఇద్దరికి తోడు 13 కలిపితే మొత్తం 15 కి చేరుతుంది. అలా 1 కి 5 క‌లిపితే ఆరు అవుతుంది. ఈ నేప‌ధ్యంలోనే లోక్‌సభ ఎన్నికల తర్వాత మిగతా మూడు ఖాళీలను భర్తీ చేస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

ఈ విస్త‌ర‌ణ‌లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, రెండోసారి అధికారంలోకి వచ్చాక, తొలి మహిళా మంత్రి పదవి ఎవరిని వరిస్తుందో అనేది ఉత్కంఠ‌గా మారింది. ప్ర‌స్తుత అసెంబ్లీలో టిఆర్ ఎస్ త‌ర‌పున ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. వీరిలో పద్మా దేవేందర్‌, గొంగిడి సునీతలు ఇద్ద‌రూ రెడ్డి సామాజికవర్గానికి, ఇక రేఖానాయక్‌ ఎస్సీ వర్గానికి చెందిన‌వారు. గ‌త స‌ర్కారులో పద్మా దేవేందర్ రెడ్డి డిప్యూటీ స్పీక‌ర్‌గా, గొంగిడి సునీత ప్రభుత్వ విప్‌గా పని చేశారు.

రేఖానాయక్ కు పార్లమెంటరీ కార్యదర్శి పదవిని ఇచ్చినా హైకోర్టు తీర్పుతో ఆమె ఆ పదవిని కోల్పోవాల్సి వ‌చ్చింది. గ‌త కేబినెట్‌లో మహిళలకు మంత్రి పదవి దక్కక‌పోవ‌డంపై సిఎం కేసీఆర్ ప‌లు విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. ఈ నేప‌ధ్యంలో ఈసారి ఖ‌చ్చితంగా మ‌హిళ‌ల‌కు అవ‌కాశం ల‌భిస్తొంద‌ని అంద‌రూ భావిస్తున్నారు. కేబినెట్ లో ఆ యా సామాజిక వ‌ర్గాల స‌మీక‌ర‌ణాల‌పై ఈ ముగ్గురిలో రేఖానాయ‌క్ కు అవ‌కాశం ల‌భిస్తుంద‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఇప్ప‌టికే రెడ్డి సామాజిక వ‌ర్గానికి స్పీక‌ర్ ప‌ద‌వి ఇవ్వ‌డంతో మ‌ళ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌విని ఆ వ‌ర్గానికే ఇచ్చే ఛాన్స్ లేదు.

దీంతో పద్మా దేవేందర్‌కు కీలక పదవిని కట్టబెట్టే యోచనలో సిఎం వున్న‌ట్లు స‌మాచారం. ఇక అదేవిధంగా గొంగిడి సునీతకు యధావిధిగా విప్‌ పదవిలో కొనసాగించే అవ‌కాశాలున్నాయంటున్నారు. ఒక వేళ విప్ గా పద్మా దేవేందర్ రెడ్డిని నియమించి త్వరలో భర్తీ చేసే పార్లమెంటరీ రాజకీయ కార్యదర్శిగా గొంగిడి సునీతను తీసుకునే అవకాశాలు కూడా వున్నాయంటున్నారు.

ఇటు డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌విని బీసీని ఎంపిక చేయాలని సిఎం ప్రతిపాదించిన‌ట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన మాజీ అటవీ, బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్న, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌, వరంగల్‌ వెస్ట్‌ ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ పేర్లు పరిశీలనకు వచ్చిన‌ట్లు తెలిసింది. చివ‌ర‌కు వినయ్‌ భాస్కర్‌ అభ్యర్థిత్వానికే మొగ్గు చూపినట్టు స‌మాచారం. బీసీల జాబితాలో ప‌లువురు తాజా మాజీల‌తో పాటు మ‌రికొంద‌రి పేర్లు ప‌రిశీల‌న‌లో వున్నాయి. ఎస్సీ సామాజికవర్గం నుంచి కొప్పుల ఈశ్వర్‌, గువ్వల బాలరాజు, బాల్క సుమన్‌, డాక్టర్‌ రాజయ్య తదితరుల పేర్లపై కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అటు రెడ్డి సామాజికవర్గం నుంచి మంత్రివర్గంలో కనీసం ఐదు మందిని తీసుకోవాలన్న నిర్ణయానికి సిఎం కేసీఆర్‌వ‌చ్చిన‌ట్లు తెలిసింది.

ఇప్పటికే స్పీకర్‌గా పోచారం శ్రీనివాసరెడ్డిని నియమించడంతో మరో నలుగురికి ఈ సామాజికవర్గం తరఫున మంత్రి పదవులు పొందే అవకాశం ఉందంటున్నారు. మొద‌టిసారిగా అసెంబ్లీ లో అడుగుపెట్టిన వారిలో ముగ్గురిని మంత్రులుగా ఎంపిక చేయాలన్న ప్రతిపాదనపై కూడా ప‌రిశీల‌న‌లో వున్న‌ట్లు స‌మాచారం. అయితే వ‌డ‌పోత అనంత‌రం మ‌రో 13 మందికి మంత్రివ‌ర్గంలో ఛాన్స్ ల‌భించే అవ‌కాశాలున్నాయ‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు భావిస్తున్నారు.