గోదావ‌రి తీరంలో బిసిల‌కు జ‌య‌హో పేరిట టిడిపి గంపెడాశ‌లు

TDP
TDP

* రాజమండ్రిలో టిడిపి జయహో బీసీ సభ
* పెద్దసంఖ్యలో హాజ‌ర‌యైన బీసీలు
* బీసీలకూ సబ్‌ ప్లాన్‌… చట్టబద్ధత
* కార్పొరేషన్లుగా 8 ఫెడరేషన్లు
* వంద కోట్లతో జ్యోతిబా ఫూలే పార్కు,
* అమరావతిలో 100 కోట్లతో బీసీ భవన్‌

అనాదిగా పార్టీని న‌మ్ముకుంటూ ప్ర‌ధాన ఓట్ బ్యాంక్ గా వ‌చ్చిన బిసిల‌కు తెలుగుదేశం పార్టీ ఎన్నిక‌ల ముందు గంపెడాశ‌లు పెట్టింది. రాజమండ్రి ఆర్ట్స్‌ కాలేజీ మైదానంలో జయహో బిసి పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించింది. 1994ఎన్నికలకు ముందు ఎన్‌టిఆర్‌ ఇక్కడ్నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అప్పట్లో ఇక్కడి సభకు లక్షలమంది హాజరయ్యారు. ఆనాటి ఎన్నికల్లో తెలుగుదేశం అనూహ్య విజయాన్ని నమోదు చేసింది. అప్పటికీ ఇప్పటికీ రాజమండ్రి అంటే రాజకీయ పార్టీలకు ఓ ప్రత్యేక సెంటిమెంట్‌ ఉంది. ఈ సెంటిమెంట్‌నే చంద్రబాబు అనుసరించారు. తెలుగుదేశం ఏర్పాటు నుంచి బిసిలకు ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారు.

ఆ తర్వాత ఎన్ని పార్టీలొచ్చినా బిసిల్లో అత్యధికులు తెలుగుదేశం వైపే నిలబడ్డారు. జ‌య‌హో బిసిల పేరిట రాజమండ్రి ఆర్ట్స్‌ కాలేజీ మైదానంలో ఈ భారీ బహిరంగ సభను నిర్వహించారు.ఈ సభలో తెలుగుధేశం పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి చంద్రబాబు బిసిల సంక్షేమంపై వ‌రాల జ‌ల్లు కురిపించారు. 36 ఏళ్ళుగా తెలుగుదేశానికి అండగా ఉన్న వెనుకబడ్డ వర్గాలకు గత ఐదేళ్ళలో తెలుగుదేశం ప్రభుత్వం చేకూర్చిన ప్రయోజనాల్ని వివరించారు. ఎన్నికల్లోగా అమలు చేయనున్న పథకాల్నిఏక‌రువు పెట్టారు. కాంగ్రెస్‌ హయాంలో బిసిల పట్ల అణచివేత ధోరణిని అనుసరించారంటూ విమ‌ర్శంచారు. ముఖ్యంగా వైఎస్‌ బిసిల్ని అణగదొక్కార‌ని ఆరోపించారు.

రాష్ట్రంలో బీసీలకు సబ్ ప్లాన్‌ తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆ సబ్‌ప్లాన్‌కు చట్టబద్దత కల్పిస్తామన్నారు. తమది బీసీల ప్రభుత్వమని వెల్ల‌డించారు. బీసీల్నుంచి తమనెవరూ వేరు చేయలేరన్నారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి బీసీ వర్గాలు తమ వెంటే ఉన్నాయన్నారు.ప్రస్తుతమున్న 13 ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మారుస్తామని చంద్రబాబు ప్రకటించారు. బిసి సామాజికవర్గాలకు జనాభా ప్రాతిపదికన మరికొన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. రజక, నాయీబ్రాహ్మణ, వడ్డెర, తగర, వార్మీకులకు కలిపి ఓ కార్పొరేషన్‌ నెలకొల్పుతామన్నారు. రజకులు, అగ్నికుల క్షత్రీయుల్ని ఎస్‌సిల్లో చేర్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. అలాగే వాల్మీకి, బోయలను ఎస్‌టిలుగా గుర్తించాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు.