టాక్సీవాలా

హీరో ఓ ఇంట్లో ప్ర‌వేశించ‌డం, అందులో ఓ దెయ్యం ఉండ‌డం, హీరోనీ, అత‌ని గ్యాంగ్‌నీ దెయ్యం ఓ ఆటాడుకోవ‌డం – ఇంత‌సేపూ ఇలాంటి క‌థ‌లే చూశాం. అవే విజ‌యాలు అందించాయి. అవే బోర్ కొట్టించాయి. వాటితో పోలిస్తే.. టాక్సీవాలా క‌థ‌, క‌థ‌నాలు భిన్నంగా అనిపిస్తాయి. ఈ సినిమాకు ఆయువుప‌ట్టు అయిన ఆస్ట్రాల్ ప్రొజ‌క్ష‌న్ అనే పాయింట్ కొత్త‌గా ఉంది. పారానార్మ‌ల్ సైక‌లాజీలోని ఈ అంశాన్ని తీసుకొని దాని చుట్టూ క‌థ‌ను అల్లుకున్నాడు ద‌ర్శ‌కుడు.

ఇంత‌కి ఆస్ట్రాల్ ప్రొజ‌క్ష‌న్ అంటే ఏమిటి? ఈ సినిమా క‌థ‌లో అందించిన సమాచారం ప్ర‌కారం..కొన్ని ప్ర‌త్యేక ప‌రిస్థితుల న‌డుమ మ‌నిషి శ‌రీరం నుంచి ఆత్మ‌ను తాత్కాలికంగా వేరు చేయ‌వ‌చ్చు. అలా వేరైన ఆత్మ ఇదివ‌ర‌కే సంచ‌రిస్తున్న ఆత్మ‌లతో సంభాషించ‌వొచ్చు. అంటే మ‌నం కోల్పోయిన ప్రియ‌మైన వారితో, ఆప్తుల‌తో స‌బ్‌కాన్షియ‌స్ మైండ్ ద్వారా సంభాషించ‌వొచ్చ‌న్న‌మాట‌. అయితే ఇందులోని హేతువు ఎలా ఉన్నా థియ‌రిటిక‌ల్‌గా తెలుసుకోవ‌డానికి ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ఈ పాయింట్ ద‌గ్గ‌రే ప్రేక్ష‌కులు సినిమాతో క‌నెక్ట్ అయిపోతారు.

ఆరంభంలో ఎక్క‌డా ఉత్కంఠ‌భ‌రిత‌మైన ఎత్తుగ‌డ లేకండా సాదాసీదాగా ఈ క‌థ ఆరంభ‌మ‌వుతుంది. కారులో దెయ్య‌ముంద‌ని తెలుసున్న త‌ర్వాత ఒక్క‌సారిగా క‌థాగ‌మ‌నంలో వేగం పెరుగుతుంది. డాక్ట‌ర్ అయిన ఉత్తేజ్ త‌న కారులో ప్ర‌యాణిస్తూ అనూహ్యంగా హ‌త్య చేయ‌బ‌డ‌టంతో క‌థ కీల‌క మ‌లుపు తీసుకుంటుంది. ఇక అక్క‌డి నుంచే కథ‌లో స‌స్పెన్స్ ఆరంభ‌మవుతుంది. ర‌ఘురామ్ ఇంటిలో బందీగా ఉన్న ప్రొఫెస‌ర్ ర‌వివ‌ర్మ‌ను శివ క‌లుసుకోవ‌డంతో క‌థ‌లోని ఆస్ట్రాల్‌ప్రొజ‌క్ష‌న్ అనే మెయిన్ పాయింట్ రివీల్ అవుతుంది. ప్ర‌థ‌మార్థంలో శివ‌..అత‌ని స్నేహితులు మ‌ధునంద‌న్‌, విష్ణు (సైన్మా షార్ట్‌ఫిల్మ్ ఫేమ్‌) మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు మంచి వినోదాన్ని పంచుతాయి. డాక్ట‌ర్ అనుతో శివ ప‌రిచ‌యం, రొమాంటిక్ స‌న్నివేశాల్ని కూడా చ‌క్క‌గా ఆవిష్క‌రించారు. ఇక ద్వితీయార్థంలో వ‌చ్చే ఫ్లాష్‌బ్యాక్‌లో ప్రొఫెస‌ర్

ర‌వివ‌ర్మ…శిశిర మీద ఆస్ట్రాల్ ప్రొజెక్ష‌న్ ప్ర‌యోగానికి సంబంధించిన‌ ఎపిపోడ్ ఉత్కంఠ‌ను పంచింది. మార్చురీలో ఉన్న శిశిర బాడీని బ‌య‌ట‌కు తీసుకురావ‌డానికి శివ చేసే ప్ర‌య‌త్నాల నుంచి సినిమా మ‌రింత స‌స్పెన్స్‌తో సాగింది. ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ ద‌గ్గ‌రే టాక్సీవాలా స్పీడుకు బ్రేకులు ప‌డ్డాయి. అవి మ‌రీ సినిమాటిక్‌గా, డ్ర‌మెటిక్‌గా సాగాయి. శిశిర పాత్ర ద్వారా మాన‌వీయ కోణాన్ని ఆవిష్క‌రించ‌డం ప్రేక్ష‌కుల్ని క‌దిలిస్తుంది. క‌థ ఆద్యంతం సీరియ‌స్ నోట్‌లో సాగుతున్న‌ప్ప‌టికీ వినోదం మాత్రం ఎక్క‌డా మిస్ కాలేదు. మ‌ధునంద‌న్‌, విష్ణు, చ‌మ్మ‌క్ చంద్ర కామెడీ ట్రాక్ క‌డుపుబ్బా న‌వ్విస్తుంది.

సైన్మా షార్ట్‌ఫిల్మ్ ద్వారా గుర్తింపును సంపాదించుకున్న విష్ణు ఈ సినిమాలో మంచి హాస్యాన్ని పండించాడు. అత‌ని కామెడీ టైమింగ్‌, తెలంగాణ‌స్లాంగ్ బాగున్నాయి. చాలా రోజుల త‌ర్వాత మ‌ధునంద‌న్ కూడా కావాల్సినంత వినోదాన్ని పంచారు. ఆస్ట్రాల్ ప్రొజ‌క్ష‌న్ అనే కాన్సెప్ట్ మీద ద‌ర్శ‌కుడు మంచి రీసెర్చి చేశాడ‌నిపించింది. సినిమా ఆద్యంతం ఎక్క‌డా బోర్ అనిపించ‌కుండా స‌న్నివేశాల్ని అల్లుకున్న విధానం ఆక‌ట్టుకుంటుంది. హ్యుమ‌ర్‌, ఎమోష‌న్స్‌, స‌స్పెన్స్ అంశాల్ని స‌మ‌పాళ్ల‌లో రంగ‌రించ‌డం ఈ సినిమాకు పెద్ద‌బ‌లం.