చంద్రబాబువి చిల్లర రాజకీయాలు మంత్రి తలసాని

Talasani Srinivas Yadav
Talasani Srinivas Yadav

తెలుగుదేశం అధినేత, ఏపి సిఎం చంద్రబాబుకి ఓటమి భయం పట్టుకుందన్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు బలపరుస్తున్నారన్నారు. ఓటు వేసిన ప్రజలకు, కష్టపడి పని చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలన్నారు. రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలను టీఆర్‌ఎస్ గెలవబోతుందని జోస్యం చెప్పారు తలసాని. ఏపీలో పోలింగ్ శాతం బాగుందన్నా ఆయన.. పోలింగ్‌పై టీడీపీ డ్రామాలాడుతోందన్నారు. ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత పబ్లిసిటీ కోసమే చంద్రబాబు ఈసీని కలిశారన్నారు. ఏపీ ఎన్నికల్లో దాదాపు 42 వేల ఈవీఎంలు వాడితే అందులో 300 ఈవీఎంలలోనే సమస్యలు తలెత్తాయన్నారు. ఆ 300 ఈవీఎంలపైనే టీడీపీ ఆధారపడి ఉందా ? అని మంత్రి తలసాని ప్రశ్నించారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా చంద్రబాబు మాట్లాడారని, నాలుగు ఓట్ల కోసం చిల్లర రాజకీయాలు చేస్తారన్నారు తలసాని. ఓట్ల కోసం ఏపీ, తెలంగాణ ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని చంద్రబాబు ప్రయత్నం చేసినట్లు మంత్రి వివరించారు.