నటి జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు

Jaya Pradha
Jaya Pradha

ప్రముఖ నటి, బిజెపి లోక్‌సభ అభ్యర్ధి జయప్రదపై సమాజ్‌వాదీ పార్టి సీనియర్‌ నేత ఆజంఖాన్‌ అసభ్య వ్యాఖ్యలు చేశారు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జాతీయ మహిళా కమీషన్‌ నోటీసులు జారీ చేసింది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో రాంపూర్‌ నియోజకవర్గంలో జయప్రదకు ప్రత్యర్ధిగా ఆజంఖాన్‌ పోటీ చేస్తున్నారు. ఆయన ఎన్నికల ప్రచారంలో జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. జయప్రదను ఉద్ధేశిస్తూ ఒక వ్యక్తిని తానే రాంపూర్‌కి పరిచయం చేశానని, ఆమె జోలికి ఎవరూ రాకుండా చూసుకున్నానని , కాని ఆ వ్యక్తి నిజ స్వరూపం బయటపడిందని, జయప్రద ఖాకీ నిక్కర్‌ వేసుకున్నారంటూ అభ్యంతరంగా మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలపై పెను దుమారం రేగింది.

మహిళలను కించపరుస్తూ మాట్లాడిన ఆయనపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. జాతీయ మహిళా కమీషన్‌ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఈసికి మహిళా కమీషన్‌ లేఖ రాసింది. . మరోవైపు దీనిపై ఆజంఖాన్‌ స్పందిస్తూ. .తాను తప్పుగా మాట్లాడలేదని సమర్థించుకున్నారు. ఒకవేళ తాను తప్పు చేశానని నిరూపిస్తే ఎన్నికల్లో పోటీ చేయబోనని ఆజంఖాన్‌ వెల్లడించారు. కాగా ఉత్తరప్రదేశ్ లో ద్రౌపదీ వస్త్రాపహరణం జరుగుతోందని, ములాయం సింగ్ యాదవ్, భీష్ముడి మాదిరిగా మౌనంగా ఉన్నారని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మండిపడ్డారు. జయప్రదపై ఆజంఖాన్ చేసిన దిగజారుడు వ్యాఖ్యలపై స్పందించిన ఆమె.. సోషల్ మీడియాలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.