ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఉప్పు – నిప్పు ఏకం ..!

SPBSPalliance

దశాబ్దాల రాజకీయ శత్రుత్వాన్ని వెనక్కునెట్టి సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, బీఎస్‌పీ సుప్రీం మాయావతి ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో చేతులు కలిపారు. ఉప్పు – నిప్పులా వుండే రెండు పార్టీలు జ‌త‌క‌ట్టాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఎస్పీ – బీఎస్‌పీ కూటమిగా ఏర్పడినట్టు ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో అఖిలేష్, మాయావతి అధికారికంగా ప్రకటించారు. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 80 స్థానాలకు గానూ చెరో 38 చోట్ల పోటీ చేయాలని నిర్ణయించాయి.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోనప్పటికీ అమేథీ , రాయ్ బరేలీ స్థానాల్లో పోటీ చేయబోమని స్పష్టం చేశాయి. మిగిలిన రెండు స్థానాలను మిత్రపక్షాలకు కేటాయిస్తామని ఇరువురు నేత‌లు వెల్ల‌డించారు. ఎస్పీ, బీఎస్పీ పొత్తును విప్లవాత్మక పొత్తుగా మాయావతి అభివర్ణించారు. దేశంలో ఈ పొత్తు ఒక కొత్త రాజకీయ విప్లవానికి నాంది అని మాయావతి అన్నారు. మోదీ – అమిత్ షా జోడికి ఇక నిద్రలేని రాత్రులు తప్పవని అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు.