పంచాయితీ ఎన్నిక‌ల్లో సిరా గుర్తు మారింది..!

telangana elections

త్వరలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసిన ఓటరుకు గుర్తింపుగా ఈసారి సిరా గుర్తును ఎడమచేతి మధ్యవేలుకు గుర్తుపెట్టాలని రాష్ట్ర ఎన్నికలసంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల అసెంబ్లీ కు జరిగిన ఎన్నికల్లో ఓటేసినందుకు గుర్తుగా, ఓటరు ఎడమచేతి చూపుడు వేలుకు సిరా గుర్తును వేశారు. కానీ పంచాయతీ ఎన్నికల నాటికి ఆగుర్తు చెరిగి పోలేదన్న కారణంతో తాజాగా జరిగే పంచాయతీ ఎన్నికల్లో ఎడమచేతి మధ్యవేలికి గుర్తును పెట్టాలంటూ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు శిక్షణ పొందిన పోలింగ్‌ సిబ్బందికి దీనిపై అవగాహన కల్పించనున్నారు. ఇక స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థులకు గుర్తులను ఎన్నికల సంఘం కేటాయించింది.

సర్పంచి అభ్యర్థులకు 20 గుర్తులు, వార్డు సభ్యులకు 15 గుర్తులను కేటాయించింది.. సర్పంచి అభ్యర్థులకు.. బుట్ట, ఉంగరం, కత్తెర, కుట్టుమిషన్‌, బ్యాట్‌, పలక, బల్ల, బ్యాటరీలైటు, బ్రష్‌, క్యారెట్‌, టేబుల్‌ బల్బు, దూరదర్శిని, చేతికర్ర, షటిల్‌, మొక్క జొన్న, నగరా, దువ్వెన, మంచం, కప్పుసాసరు, కొవ్వొత్తిని కేటాయించింది. ఇటు పోటీ చేసే వార్డు సభ్యులకు విద్యుత్‌ స్థంబం, గ్యాస్‌పొయ్యి, హార్మోనియం, టోపీ, ఇస్ర్తీపెట్టె, పోస్టుబాక్సు, ఫోర్క్‌, చెంచా, జగ్గు, గౌను, స్టూలు, బీరువా, ప్రెషర్‌ కుక్కర్‌, ఐస్‌క్రీమ్, కెటిల్‌ గుర్తులను ఎన్నికల సంఘం కేటాయించింది.