తెలంగాణ‌లో ఒక ద‌శ – ఏపిలో రెండు విడ‌త‌లుగా ఎన్నిక‌లు ..!

లోక్ సభ ఎన్నికలు తెలంగాణలో ఒకే దశలో జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం రెండు దశల్లో జరుగుతాయని విశ్వసనీయ సమాచారం. ఫిబ్రవరి చివరి వారంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలవుతుందని, లేదా మార్చి మొదటివారంలో ఎన్నిక‌ల క‌మీష‌న్ షెడ్యూల్ ను ప్రకటిస్తుందని సమాచారం.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు మొత్తం ఒకే దశలో ప్రశాంతంగా ముగిసినందునే లోక్ సభ ఎన్నికలను కూడా ఒకే దశలో ముగించేందుకు ఈసీ ప్రణాళిక రూపొందించనుందని తెలుస్తోంది. తెలంగాణతో పోలిస్తే.. ఏపీలో లోక్‌ సభ నియోజకవర్గాలు అధికంగా ఉండటం, ఆంద్న‌ప్ర‌దేశ్ లో అసెంబ్లీ ఎన్నికలను సైతం జరిపించాల్సివుండటం కారణంగానే రెండు దశల ఆలోచనను ఈసీ చేస్తున్నట్టు సమాచారం.

ఈ మేరకు రాష్ట్రాల సీఈఓలకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి మార్గదర్శకాలు అందాయి. వచ్చే వారం నుంచి ఎలక్షన్ కమిషన్ అన్ని రాష్ట్రాల్లో పర్యటించి అధికారులతో సమీక్ష జరపనుంది. రాష్ట్రాల పర్యటన పూర్తి అయిన వారం, పది రోజుల్లోగానే షెడ్యూల్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.