కాంగ్రెస్ వార్ రూంలో తెలంగాణ నేత‌లు ఏమ‌న్నారంటే ..!

Telangana Congress Party

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకున్న కాంగ్రెస్ ఇప్పుడు సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌వైపు అడుగులు వేస్తోంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో అనుసరించే వ్యూహాంపై ఢిల్లిలోని వార్‌ రూంలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలతో రాహుల్ సమావేశం అయ్యారు. అసెంబ్లి ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలను రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు వివరించారు. పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తే తప్ప, అధికార టిఆర్ ఎస్ ను ధీటుగా ఎదుర్కోలేమని సూచించిన‌ట్లు స‌మాచారం.పార్టీలో మార్పులు, చేర్పులు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్‌ ముఖ్యనేతలు రాహుల్ ను కోరిన‌ట్లు తెలిసింది.

క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉన్నా, వారిని నడిపించే నాయకత్వం రాష్ట్రంలో లేదని ఆయ‌న దృష్టికి తీసుకువెళ్లారు. ఇప్పటికైనా మించి పోయింది లేదని పార్టీ నాయకత్వంలో కొత్త నీరు తీసుకురావాలన్నారు. త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో యువ రక్తాన్నినింపి, వారిని అభ్యర్థులుగా ఎంపిక చేయాలని రాహుల్ కోరినట్లు తెలుస్తోంది. అనంత‌రం రాహుల్ మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థులను ముందే ప్రకటిస్తామ‌న్నారు.

పార్టీ అభ్యర్థుల విజయం కోసం అంద‌రూ స‌మిష్టిగా కృషి చేయాల‌న్నారు. పొత్తులు అనేవి జాతీయ, స్థానిక అంశాలను బట్టి నిర్ణయాలు ఉంటాయ‌న్నారు ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్.ఈ భేటీకి కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ కుంతియా, టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి , సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్స్‌ రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో పాటు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.