తెలంగాణ ఎమ్మెల్యేల‌కు సంక్రాంతి బంప‌ర్ ఆఫ‌రే ..!

TRS MLAS

నిద్ర‌లేని రాత్రులు గ‌డ‌పాల్సి వ‌స్తోంద‌ని బెంబేలు ప‌డిన తెలంగాణ ఎమ్మెల్యేల‌కు సంక్రాంతి బంప‌ర్ ఆఫ‌ర్ త‌గిలింది. మంత్రివర్గ విస్తరణకు, గ్రామ పంచాయితీ ఎన్నికలకు ఎటువంటి సంబంధం లేదని తేలింది. దీంతో మంత్రివర్గ కూర్పు సంక్రాంతి తర్వాత ఉండవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పంచాయితీరాజ్‌ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం మంత్రివర్గ విస్తరణ, అసెంబ్లీ సమావేశాలు నిర్వహించరాదన్న రాష్ట్ర ఎన్నికల సంఘం చేసిన ప్రకటన పై ముఖ్యమంత్రి కార్యాలయ ఉన్నతాధికారులు, పంచాయితీరాజ్‌ శాఖ అధికారులు ప్రత్యేకంగా సమావేశమై ఎన్నికల నియమావళిని అధ్యయనం చేశారు. ఈ భేటీలో మంత్రివర్గ విస్తరణకు, అసెంబ్లి సమావేశాలకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఏమాత్రం అడ్డంకి రాదని తేల్చినట్టు స‌మాచారం. దీంతో కేబినెట్ విస్తరణ ఎప్పడైనా జరపవచ్చని అధికారులు తేల్చారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి సంబంధించి శాసనసభ సమావేశాలను ఎప్పుడైనా నిర్వహించుకోచ్చని, దీనికి ఎన్నికల కోడ్‌ అడ్డంకి కాదని అధికారులు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

సీఎం కేసీఆర్ ముందుగా నిర్ణయించినట్టు సంక్రాంతి తర్వాత మంత్రివర్గ విస్తరణకు అవకాశాలు మెండుగా ఉన్నాయని ప్రచారం అవుతోంది. తనతో పాటు మంత్రిగా మహమూద్‌ అలీని మంత్రివర్గంలో చేర్చుకున్నసిఎం కేసీఆర్‌ వారం, పది రోజుల్లో మరికొంత మందితో మంత్రివర్గాన్ని విస్తరిస్తారని సంకేతాలిచ్చారు. జనవరి 16 వరకు మంచి రోజులు ఉన్నాయని, 18వ తేదీన మంచి ముహూర్తం ఉందని తెలియడంతో ఆ రోజున మంత్రివర్గాన్ని విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయి.హ‌స్తిన టూర్ త‌ర్వాత కేసీఆర్‌ గవర్నర్‌ నరసింహన్‌తో ప్రత్యేకంగా సమావేశమై తన మనసులోని మాటను గవర్నర్‌కు చెప్పారని టి ఆర్ ఎస్ నేతలు భావిస్తున్నారు. మంత్రి పదవుల కోసం తనను కలుస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు టి ఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ కేటీఆర్ కూడా సంక్రాంతి తర్వాత ఉండవచ్చని చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.

పంచాయితీ ఎన్నికలు ఈనెల 30వ తేదీతో ముగుస్తున్నాయి. వచ్చే నెల 10, 11 తేదీల్లో సహకార ఎన్నికలు జరగనున్నాయి. ఈలోపు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడుతోంది. అప్పటిదాకా మంత్రివర్గాన్ని విస్తరించకుండా జాప్యం చేయడం మంచిది కాదన్న భావనతో కేసీఆర్‌ ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే మంత్రివర్గంలో కేసీఆర్‌తో పాటు మహమూద్‌ అలీ ఉన్నారు. మరో 16 మందిని చేర్చుకునే అవకాశం ఉంది. ఈ విస్తరణలో ఎంత మందిని తీసుకుంటారన్న చర్చ కూడా పార్టీలో, బయట సాగుతోంది. ఆరు నుంచి ఎనిమిది మందిని ఈ విడత తీసుకునే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అయితే మిగిలిన వారిని లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగే విస్తరణలో చేర్చుకుంటారన్న ప్రచారం జ‌రుగుతోంది. 18వ తేదీన మంత్రివర్గాన్ని విస్తరించి పంచాయితీరాజ్‌ తొలి విడత ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే ఒకరోజు పూర్తిగా అసెంబ్లీను సమావేశ పరిచి ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నట్టు తెలుస్తోంది.