ఒకేసారి ఎన్నిక‌లు జ‌ర‌పాల‌ని సీఈసికి సూచ‌న

election commission of india
election commission of india

రానున్న పార్లమెంట్ ఎన్నికలను రెండు తెలుగు రాష్ర్టాల్లో ఒకేసారి నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి లిఖిత పూర్వకంగా కోరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో ఒకే విడుతలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా క్రాస్ ఓటింగ్, డూప్లికేట్ ఓటింగ్ వంటివి నివారించవచ్చని ఆయ‌న సూచించారు.

గత సార్వత్రిక ఎన్నికలు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రాతిపదికన జరిగాయని, ఈసారి వేర్వేరు రాష్ర్టాలుగా జరుగుతున్నాయని ఆయ‌న వివ‌రించారు. ప్రస్తుతం తెలంగాణలో 17, ఏపీలో 25 ఎంపీ సీట్లు ఉన్నాయన్నారు ఆయ‌న‌. ఇప్పటికీ రెండు తెలుగు రాష్ర్టాలకు చెందినవారు చాలా మంది హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారని వెల్లడించారు. . తెలంగాణలోని ఆరు జిల్లాలు ఏపీతో సరిహద్దుగా ఉన్నాయన్నారు ఆయ‌న‌.

ఆంద్ర‌ప్ర‌దేశ్‌కి చెందిన వారిలో చాలామంది తెలంగాణలో సైతం ఓటుహక్కు కలిగిఉన్నారన్నారు రజత్ కుమార్. ఈ రెండు రాష్ర్టాల్లో ఒకే రోజు పార్లమెంటు ఎన్నికలను నిర్వహించడం ద్వారా ప్రలోభాలకు తావు లేకుండా చేయవ‌చ్చ‌న్నారు. బోగస్ ఓట్లు, డబుల్ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు వంటి వాటిని నివారించేందుకు వీలు క‌ల్గుతుంద‌న్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌లోని ముగ్గురు కమిషనర్ల దృష్టికి తమ ప్రతిపాదనను తీసుకెళ్లాలని కోరారు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్.