కోలారు సభలో మోదీని టార్గెట్ చేసిన రాహుల్

Rahul Gandhi
Rahul Gandhi

దేశంలో ఉపాధిని సృష్టించడానికి చేసిందేమిటో మోదీ చెప్పాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిలదీశారు. కర్నాటకలోని కోలార్‌‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగం 45 ఏళ్ళలో అత్యధిక స్థాయికి చేరిందన్నారు ఆయన. ఈ ఎన్నికలు రెండు భావజాలాల మధ్య జరుగుతున్నాయన్నారు. అందరి అభివృద్ధి, సమైక్యత ప్రధాన అంశాలుగా కాంగ్రెస్ అడుగులు వేస్తొంటే , ప్రజలను విభజించడాన్నే బీజేపీ నమ్ముకుందన్నారు రాహుల్ . బీజేపీ రూ.15 లక్షల చొప్పున ప్రజల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని చెప్పిందని, ఇదంతా అబద్ధమని తేలిపోయిందన్నారు. అందుకే తాము కనీస ఆదాయ మద్దతు పథకాన్ని రూపొందించామన్నారు. పేదలకు ఏటా 72 వేల నగదు అందజేయడమే ఈ పథకం ఉద్దేశమని రాహుల్ స్పష్టం చేశారు. తాము ఈ పథకంపై నిర్ణయం తీసుకున్న వెంటనే కాపలాదారు ముఖం మారిపోయిందని ఎద్దేవా చేశారు రాహుల్ .