టీఆర్ఎస్ సర్కార్ రిమోట్ మోదీ చేతిలో వుంది – రాహుల్

RahulGandhi
RahulGandhi

తెలంగాణ ప్రభుత్వం రిమోట్ ప్రధాని నరేంద్ర మోదీ చేతిలో ఉందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ సర్కార్ రిమోట్ మోదీ చేతిలో ఉందన్నారు ఆయ‌న‌. ఈ నెల 11న జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటేస్తే మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ కు వేసినట్టేనన్నారు రాహుల్‌.

ఎన్నికల ముందు బీజేపీ, టీఆర్ఎస్ డ్రామా నడిపిస్తున్నాయని చెప్పారు. ఎన్నికల ప్రచార సభల్లో మోదీని కేసీఆర్ తిట్టడం, కేసీఆర్ ని మోదీ తిట్టడం ఒట్టి డ్రామాగా అభివర్ణించారు. చౌకీదార్ మోదీ దొంగ అని కేసీఆర్ ఎప్పుడైనా అన్నారా ? అని ప్రశ్నించారు . తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మధ్యే యుద్ధం జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వివ‌రించారు.

పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం వెనక్కి రాలేదని విమర్శించారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు, చిరు వ్యాపారులు ఇబ్బందులు పడ్డ విషయాన్ని గుర్తు చేశారు. ప్రతి పేద కుటుంబానికి నెలరూ రూ.12వేల ఆదాయం ఉండేలా చూస్తామన్నారు. ఇచ్చిన మాటకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందన్నారు. ఈ ఎన్నికల్లో మోడీ, కేసీఆర్ లను ఓడించడమే లక్ష్యమన్నారు రాహుల్ .