మహిళా రిజర్వేషన్ల బిల్లుపై రాహుల్ ఏమ‌న్నారో తెలుసా..!

Rahul Gandhi
Rahul Gandhi

సార్వ‌త్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందేలా చేస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రకటించారు. కొచ్చిలో కాంగ్రెస్‌ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన ఈ మేరకు హామీ ఇచ్చారు. మహిళా బిల్లును కూడా ప్రాధాన్యత ఇచ్చి ఆమోదిస్తామన్నారు. 2019లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదిస్తామని రాహుల్ ప్రకటించారు. గత ఐదేళ్ల బీజేపీ పాలనలో కేవలం మోడీకి సన్నిహితులైన 15 మంది శక్తివంతులకే అత్యధిక ఆదాయం ఆర్జించేందుకు సహాయం చేశారంటూ రాహుల్‌ ఎద్దేవా చేశారు.

రాఫెల్‌ కుంభకోణంతో రిలయన్స్‌ డిఫెన్స్‌ అధిపతి అనిల్‌ అంబానీకి వేల కోట్ల రూపాయలు దోచిపెట్టేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, దేశంలోని ప్రతి పేదవాడికి కనీస ఆదాయ పథకం అమలు చేస్తామని మ‌రోసారి వెల్ల‌డించారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు రైతు రుణ మాఫీ చేశాయని, ఎన్డీయే ప్రభుత్వం రైతులకు చేసిన అన్యాయాలన్నింటినీ సరిదిద్దుతామన్నారు. శబరిమల వివాదంపై స్పందిస్తూ.. కాంగ్రెస్‌ పార్టీ కేరళ సంప్రదాయాలను, కేరళ మహిళల మనోభావాలను గౌరవిస్తుందన్నారు. కేరళలో సీపీఎం, బీజేపీ హింసాకాండను కాంగ్రెస్‌ పార్టీ ఖండిస్తుందన్నారు.