ప్రియ ప్రకాష్ ‘లవర్స్ డే’ మూవీ రివ్యూ

Lovers day Review
Lovers day Review

విడుదల తేదీ : ఫిబ్రవరి 14, 2019
రేటింగ్ : 2.5/5
నటీనటులు : ప్రియా వారియర్, రోష‌న్‌, నూరిన్ షెరిఫ్‌, మాథ్యూ జోస‌ఫ్‌, వైశాఖ్ ప‌వ‌న‌న్‌, అన్‌రాయ్ త‌దిత‌రులు
దర్శకత్వం : ఒమ‌ర్ లులు
నిర్మాతలు : ఎ. గురురాజ్‌, సి.హెచ్‌. వినోద్‌రెడ్డి
సంగీతం : షాన్ రెహ‌మాన్‌
సినిమాటోగ్రఫర్ : శీను సిద్ధార్థ్‌
స్క్రీన్ ప్లే : సారంగ్ జ‌య‌ప్ర‌కాష్‌, లిజో ప‌నాడా
ఎడిటర్ : అచ్చు విజ‌య‌న్‌

ఒక సంవత్సరం క్రితం తన వింక్ వీడియోతో ఓవర్ నైట్ లో కోట్లలో ఫాలోయింగ్ సంపాదించుకున్న అమ్మాయి ప్రియావారియర్. ఈమె మళయాళంలో నటించిన ఒరు ఆధార్ లవ్ సినిమా తెలుగులో లవర్స డే పేరుతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.అల్లు అర్జున్ సైతం ఈ వేడుకకు ముఖ్య అతిధిగా వచ్చి ప్రియా ని ఒక రేంజ్ లో పొగిడెయ్యడంతో ఈ సినిమాకి ఇక్కడ కూడా ఫుల్ హైప్ వచ్చింది .సినిమాకూడా భారీ గా రిలీజ్ చేసారు.

కథ:

కాలేజ్ డేస్.. ఫ్రెండ్స్.. లవ్.. కుళ్లు జోకులు.. సింపుల్ గా కథ ఇదే. రోషన్.. ప్రియ.. గాధ.. ల మధ్య జరిగే కథే లవర్స్ డే. రోషన్.. గాధ స్నేహితులుగా మొదలై ప్రేమికులుగా మారిపోతారు.. అయితే వారి ప్రేమను ఎక్స్ ప్రెస్ చేసుకునే సమయానికి అనుకోని సంఘటన జరుగుతుంది.అనుకోని ఆ సంఘటన ఏంటి?..వాళ్ళ లవ్ స్టోరీ లోకి ప్రియా ఎలా ఎంటర్ అయ్యింది?.ఆ తరువాత ఈ లవ్ లవ్ స్టోరీ ఎలాంటి మేలు తిరిగింది?ఫైనల్ గా ఎలా ఎండ్ అయ్యింది? అనే సింపుల్ ప్లాట్ తో ఈ సినిమాని తెరకెక్కించారు.

విశ్లేషణ:

ఈ తరహా కథలు తెలుగులో చాలా వచ్చాయి.చాలావరకు హిట్ అయ్యాయి కూడా.చిత్రం, నువ్వు-నేను, సొంతం లాంటి ఎన్నో సినిమాలు ఇలాంటి లైన్ ని,కాలేజ్ బ్యాక్ డ్రాప్ ని నమ్ముకుని తెరకెక్కినవే.లెక్చరర్లు స్టూడెంట్స్ మధ్య వచ్చే కుళ్లు జోకులు.. ప్రేమ.. ఆకర్షణ.. స్నేహితులు.. వీటి చుట్టే తిరిగిన ఏ కథ అయినా .. ఓ వయసు వారిని మాత్రం ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ప్రేమ లో ఉన్నా.. గతంలో ఏవైనా జ్ఞాపకాలు ఉన్నా.. సినిమా చూస్తూ ఉంటే అవి బాగానే గుర్తొస్తాయి. అయితే సినిమా అంతా సరదాగా వెళ్తూ ఉంటే.. మరీ నాసిరకంగా ఉంటుందేమో అనో.. లేక ముగింపు ఎలా ఇవ్వాలో తెలియక దర్శకుడు విషాదం తో తెరదించేశాడు.తెలుగు వాళ్లకు అది అంతగా కనెక్ట్ కాకపోవచ్చు.కానీ ఈ సినిమా మొదలు పెట్టినపుడు కేవలం మలయాళం వెర్షన్ ని మాత్రమే డిజైన్ చేసుకున్నారు.ప్రియా కి వచ్చిన క్రేజ్ వల్లే తెలుగులోకి అనువదించారు.

నటీనటులు:

కాలేజ్ కుర్రాడిగా రోషన్.. అతని స్నేహితులు బాగానే నటించారు.ముఖ్యంగా రోషన్ లవర్ బాయ్ గా లుక్స్ పరంగా,నటన పరంగా కూడా అందరికి బాగా కనెక్ట్ అవుతున్నాడు.ప్రియ ప్రకాష్ వారియర్ తనకు బాగా పేరు తెచ్చిన.. కన్నుకొట్టే సీన్…లవ్ గన్ సీన్స్ తో థియేటర్ లో విజిల్స్ కొట్టించింది.ఈ సినిమాలో నటిగా ఆమె టాలెంట్ మొత్తం చూపించే అవకాశం లేకపోయినా సినిమా చూసిన వాళ్ళకి ఆమె ఏ రేంజ్ నటి అనేది మాత్రం బాగా కన్వే అవుతుంది.టీజర్ ట్రైలర్ చూసి ప్రియ మెయిన్ లీడ్ అనుకుంటే పొరపాటే.గాధ గా నటించిన నూరిన్ షరీఫ్…ప్రియా వారియర్ కంటే ఎక్కువ మార్కులు కొట్టేసింది.అందం.. అభినయం తోనూ ఆకట్టుకుంది. ఇక ప్రిన్సిపాల్.. లెక్చరర్.. ప్యూన్ పాత్రలు నవ్విస్తాయి.

టెక్నీషియన్స్:

దర్శకుడు ఒమర్ ..స్నేహం,ప్రేమ విలువలను , వాటిమధ్య తేడాను చెప్పే ప్రయత్నంలో తాను అనుకున్న కథను తెరమీదకు తీసుకురావడంలో తడబడ్డాడు. ఫస్ట్ హాఫ్ అంతా సాగతీత సీన్లతో ,రొటీన్ కామెడీతో నడిపితే..సెకండాఫ్ ఫ్లో లేని సన్నివేశాలతో .. అప్పుడే కథనుమొదలు పెట్టినట్లుగా కథలోని మెయిన్ ఎమోషన్ ఎలివేట్ కాని విథంగా ఆసక్తికరంగా లేకుండా కథను నడిపించాడు. అయితే..ఎమోషనల్ గా సాగేక్లైమాక్స్ తో మెప్పించే ప్రయత్నం చేసినా..అప్పటికే ప్రేక్షకులకు చిరాకుగా అనిపిస్తుంది. ముఖ్యంగా కథలోని మెయిన్ ప్లాట్.. సెకండాఫ్ అయితే కానీ..స్టార్ట్ అవ్వదు. అప్పటి వరకూ అనవసరమైన ట్రాక్స్ ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తాయి. యూత్ ని ఆకట్టుకునే ఇంట్రస్టింగ్ కంటెంట్ కథలో ఉన్నా… దాన్ని ఎలివేట్ చేసే అవకాశం ఉన్నా..దాన్ని యూజ్ చేసుకోలేకపోయారు. శ్రీను సిద్దార్ద్ కెమెరా పనితనం పర్వాలేదనిపిస్తుంది. షాన్ రెహమాన్ అందించిన 9 పాటల్లో 2 పాటలు అలరిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు తగ్గట్టు ఉంటుంది. ఇక ఎడిటర్ అచ్చు విజయన్ , దర్శకుడి అభిరుచికి తగ్గట్టే.. తన పనికానిచ్చేశాడు.కథకు తగినట్టుగా నిర్మాణ విలువలు ఉన్నాయి.

ఫైనల్ గా :

భారీ అంచనాలమధ్య తెలుగులోకి డబ్ అయిన ఈ మలయాళీ బొమ్మలో యూత్ కనెక్టవిటీ పాయింట్స్ ఉన్నాయి.లవర్స్ డే అనే పేరుకి తగ్గట్టు ఈ సినిమా కూడా కేవలం లవర్స్ కి మాత్రమే కనెక్ట్ అయ్యేలా ఉంది.సినిమాలో ఉన్న సాడ్ ఎండింగ్ ఈ సినిమా ఫలితాన్ని శాసించే అవకాశాలున్నాయి.లిమిటెడ్ అప్పీల్ సినిమా కాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర సేఫ్ అవ్వడం కష్టమే.