బెంగాల్ లో రాజ‌కీయ తుపాను తీవ్ర‌త‌రం

Politics in West Bengal is dominated by the following major political parties
Politics in West Bengal is dominated by the following major political parties

శారదా చిట్‌ఫండ్ కుంభకోణాల కేసులో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ప్రధాని నరేంద్రమోదీ మధ్య పోరుగా ప్రారంభమైన రాజకీయ తుఫాను… ప్రతిపక్ష పార్టీలు, మోదీ నాయకత్వంలోని కేంద్రప్రభుత్వం మధ్య యుద్ధంగా మారుతుంది. దీనిపై ఏకంగా పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం వీధికెక్కింది. సీబీఐతో, కేంద్ర ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధపడ్డారు పశ్చిమ బెంగాల్‌ ముఖ్య మంత్రి మమత. కోల్‌కత్తాలోని మెట్రో సినిమా థియేటర్‌ ఎదుట మ‌మ‌త‌ ధర్నా వేదిక జాతీయ రాజకీ యాల్లో సంచలనంగా మారింది. దీదీ తన ధర్నాని సత్యాగ్రహంగా అభివర్ణిస్తోంది రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడేందుకు తాను చేపట్టిన దీక్ష ఈ నెల 8వరకు కొనసాగుతుందని చెప్పారు. ప్రాణత్యాగానికి కూడా సిద్ధమని ప్రకటించారు.

ఈ మొత్తం వివాదానికి కేంద్ర బిందువైన కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ చిట్‌ఫండ్ కేసులో ఆధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉన్నదంటూ సీబీఐ దాఖలుచేసిన పిటిషన్‌ను విచారణకు సుప్రీంకోర్టు స్వీకరించింది. మరోవైపు బెంగాల్ ప్రభుత్వం కూడా సీబీఐకి వ్యతిరేకంగా కలకత్తా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినా.. దానిపై అత్యవసరంగా విచారణ జరిపేందుకు ధర్మాసనం నిరాకరించింది. లోక్‌సభ ఎన్నికల ముంగిట కేంద్రాన్ని ఢీ కొడుతూ మమత చేపట్టిన ఆందోళనకు పలు వర్గాల పూర్తి మద్దతు లభిస్తుంది.ఏ విష‌యంలోనూ రాజీ పడే ప్రశక్తే లేదని తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ స్ప‌ష్టం చేశారు. టీఎంసీ నేతలు వేధింపులకు గురైనప్పుడు తాను రోడ్డెక్కలేదన్నారు. కోల్ కతా పోలీస్ చీఫ్ కు అవమానం జరగడం వల్లే తాను ధర్నాకు దిగానని చెప్పారు. ఏదో రకంగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని చూస్తున్నార‌న్నారు. విప‌క్షాలు కోల్‌కతాలో నిర్వహించిన భారీ సభ విజయవంతమైన నేపథ్యంలో కేంద్రం మమతపై కక్షసాధింపు చర్యలకు దిగింద‌ని విప‌క్ష నేత‌లంగా మ‌మ‌త‌కు మ‌ద్ద‌తు ప‌లికారు.