తెలంగాణ‌లో త్వ‌ర‌లో ఎమ్మెల్సీ ఎన్నికల నగరా

MLC-Elections-in-Telangana-State

తెలంగాణ‌లో ఎన్నిక‌ల సీజ‌న్ షురూ అయింది. వచ్చేనెల మూడోవారంలో ఎమ్మెల్సీ ఎన్నికల నగరా మోగనుంది. ఇందుకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే ఖాళీ అయిన, త్వరలో ఖాళీ కాబోతున్న స్థానాలకు ఏకకాలంలో ఎన్నిక నిర్వహించాలని ఈసీ క‌స‌ర‌త్తులు చేస్తున్న‌ట్లు సమాచారం. శాసనమండలిలో మొత్తం 40 స్థానాలు ఉండగా, ప్రతి రెండేండ్లకోసారి మూడోవంతు స్థానాలు ఖాళీ అవుతాయి. కేంద్ర ఎన్నికల సంఘం వాటికి ఎన్నికలు నిర్వహించి ఆయా స్థానాలను భర్తీ చేస్తుంది. మార్చి 29 నాటికి ఎనిమిది, మే 1నాటికి ఒక ఎమ్మెల్సీ పదవీ కాలం ముగియనుంది.

ఇక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన మైనంపల్లి హన్మంతరావు, పట్నం నరేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. వరంగల్ స్థానిక సంస్థల ద్వారా ఎమ్మెల్సీగా గెలిచిన కొండా మురళి టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరి పదవికి రాజీనామా చేశారు. మొత్తం 13 ఎమ్మెల్సీ స్థానాలు మండలిలో ఖాళీ అవ‌డంతో భర్తీ ప్రక్రియను ఈసీ వేగవంతం చేసింది. 13 స్థానాల ఎన్నిక విషయంలో ఇప్పటికే స్పష్టత వుంది. మరో మూడుస్థానాల్లో మాత్రం స్పష్టత రావాల్సివుంది.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రాములు నాయక్, ఆర్ భూపతిరెడ్డి, కే యాదవరెడ్డి సభ్యత్వాలను రద్దు చేయాలని టీఆర్‌ఎస్ ఇటీవల శాసన మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేసింది. ఫిరాయింపుల చట్టం ప్రకారం ఈ ముగ్గురిపై చర్యలు తీసుకుంటే మరో మూడుస్థానాలు ఖాళీ అవుతాయి. దీంతో ఇప్పటికే ఉన్న 13 స్థానాలతో పాటు, ఈ మూడుస్థానాలు కలిపి 16 స్థానాలకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఈ నేప‌ధ్యంలో ఫిబ్రవరి మూడోవారంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి మార్చి రెండోవారం నాటికి ప్రక్రియను ముగించాలని ఎన్నిక‌ల సంఘం భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.