కోల్ క‌త్తా వేదిక‌గా బిజేపికి విప‌క్షాల చెక్ ..?

Mamata Banerjee at United India brigade Kolkata
Mamata Banerjee at United India brigade Kolkata

లోక్‌సభ ఎన్నికల ముందు కోల్‌క‌త్తా కేంద్రంగా మోదీ సర్కారుపై విపక్షాలు సమర భేరీ మోగించనున్నాయి. యునైటెడ్‌ ఇండియా బ్రిగేడ్‌ పేరిట శనివారం భారీ ర్యాలీని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత నిర్వహిస్తున్నారు. దీనికి దేశంలోని 20 పార్టీల నాయకులు హాజరవుతున్నారు. ఈ సభలో మమతతోపాటు పలువురు నాయకులు ప్రసంగిస్తారు.

బ్రిగేడ్‌ పరేడ్ మైదానంలో జరిగే ఈ ర్యాలీలో పాల్గొనేందుకు ఇప్పటికే దాదాపు 4 లక్షల మంది కోల్‌కతా చేరుకున్నట్లు స‌మాచారం. మహా కూటమి ఆవిర్భావంలో అతి కీలకమైన ఈ భేటీకి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌, యూపీఏ అధ్యక్షురాలు సోనియా హాజరు కావడంలేదు. బెంగాల్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల వినతి మేరకే వీరు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌ తరఫున సీనియర్‌ నేత లు మల్లికార్జున ఖర్గే, అభిషేక్‌ సింఘ్వీ ఈ ర్యాలీకి రానున్నారు. కోల్‌కతా ర్యాలీకి దూరంగా ఉంటున్న రాహుల్‌ గాంధీ సభకు సంఘీభావం ప్రకటిస్తూ మమతా బెనర్జీకి లేఖ రాశారు. ఈ భారీ ర్యాలీ ద్వారా ఐక్య భారత సందేశం బలంగా వినిపిస్తుందని ఆకాంక్షించారు.

ఇటు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి కూడా పాల్గొనడంలేదు. ఆమె తరఫున పార్టీ ముఖ్యనేత సతీశ్‌ చంద్ర మిశ్రా హాజరవుతారు. సీపీఐ తరఫున పా ర్టీ జాతీయ కార్యదర్శి నారాయణ హాజరవుతున్నారు. ఇటు కోల్‌కతా ర్యాలీకి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక సీఎం కుమారస్వామి (జనతాదళ్‌- ఎస్‌), ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ (ఆప్‌), శరద్‌ పవార్ (ఎన్‌సీపీ), అఖిలేశ్‌ యాదవ్ (ఎస్పీ), స్టాలిన్‌ (డీఎంకే), ఫరూక్‌ అబ్దుల్లా, ఒమర్‌ అబ్దుల్లా(నేషనల్‌ కాన్ఫరెన్స్‌), తేజస్వీ యాదవ్ (ఆర్జేడీ), సతీశ్‌ చంద్ర మిశ్రా (బీఎస్పీ), అజిత్‌ సింగ్‌(ఆర్‌ఎల్‌డీ)లతోపాటు బీజేపీ అసంతృప్త నేతలు యశ్వంత్‌ సిన్హా, శత్రుఘ్న సిన్హా, అరుణ్‌శౌరీ కూడా హాజరవుతున్నారు.

పటీదార్‌ నేత హార్థీక్ పటేల్‌, మిజోరాం విపక్షనేత లాల్ దువాహమా, అరుణాచల్‌ మాజీ సీఎం గెగాంగ్‌ అపాంగ్‌, జార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సొరేన్‌, దళిత నేత, గుజరాత్‌ ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మేవానీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

అయితే ఈ ర్యాలీలో కాంగ్రెస్‌ పాల్గొంటున్నందున తాను హాజరుకాబోనని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రకటించగా… తాము బీజేపీ, కాంగ్రెస్‌లకు సమదూరం పాటిస్తున్నందున హాజరుకావడంలేదని బీజేడీ అధ్యక్షుడు, ఒడిసా సీఎం నవీన్‌ పట్నాయక్‌ మమతకు చెప్పినట్లు తెలిసింది. వెరసి… వీరిద్దరూ బీజేపీ వ్యతిరేక శిబిరంలో ఉండబోమని దీని ద్వారా స్పష్టమైందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.మ‌రోవైపు వైసిపికి ఆహ్వానం అంద‌లేదు.