నిరాహార దీక్ష‌కు హీరో శివాజీ రెఢీ..!

Hero Sivaji

హీరో శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వంపై కొత్త కుట్రకు మరోసారి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడిన శివాజీ… టీడీపీ నుంచి ఓటర్లను దూరం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. చుక్కల భూముల పేరుతో కుట్రకు తెరదీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చుక్కల భూముల రైతులను ప్రభుత్వంపై ఉసిగొల్పేందుకు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. చుక్కల భూములను ఈస్ట్‌ ఇండియా కంపెనీ రెగ్యులరైజ్‌ చేసిందన్నారు. ఆ ఫైల్‌ను కొంతమంది అధికారులు తొక్కిపెట్టారని హీరో శివాజీ వెల్లడించారు.

కొందరు అధికారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని శివాజీ తెలిపారు . అంత ఇష్టముంటే రాజీనామా చేసి విపక్షపార్టీలో చేరాలని ఆయన సూచించారు. విపక్షానికి ప్రజాసమస్యలు పట్టవని.. వారికి కావాల్సింది సీఎం కుర్చీనేనని విమర్శించారు. చుక్కల భూములపై మంత్రులను అధికారులు లెక్కచేయడం లేదని చెప్పారు. చుక్కల భూముల సమస్య రాజకీయ ఎత్తుగడకు అవకాశంగా మారిందని ఆరోపించారు. సంక్రాంతిలోగా సమస్యను పరిష్కరించకుంటే నిరాహార దీక్ష చేస్తానని శివాజీ హెచ్చ‌రించారు.