దేశ రాజధాని కేంద్రంగా ఏపి సిఎం చంద్రబాబు పావులు కదిపేందుకు వ్యూహరచన చేస్తున్నారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంపై పోరాట బావుటా ఎగురవేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నారు. జాతీయ స్థాయిలో 22 పార్టీలను ఒకే వేదికపైకి తీసుకురావడంతో పాటు, ఆ పార్టీల నేతలు ఏకతాటిపై నడిచేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. సీఎం చంద్రబాబు ఫిబ్రవరి ఒకటిన ఢిల్లీ వెళ్లనున్నారు. పార్లమెంట్ ముందు నిరసన తెలిపేందుకు ఇప్పటికే ఎంపీలకు దిశానిర్ధేశం చేయగా ఒక్కరోజు దీక్ష చేసే ఆలోచనలో కూడా ఉన్నారు.
ఇక అదే రోజు బీజేపీ వ్యతిరేక పార్టీలతో సమావేశం కానున్న అయన ఈవీఎంల పనితీరుపై చర్చలు జరపనున్నారు. ఫిబ్రవరి ఒకటిన బీజేపీ వ్యతిరేక పార్టీల నాయకులు ఈసీని కలవనున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా కోల్ కతా సభల నిర్వహణపై కూడా చర్చలు జరపనున్నారు.మరోవైపు కోల్‌కతాలో తృణ మూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా సారధ్యంలో తొలి శంఖా రావాన్ని పూరించి విజయం సాధించారు. అలాగే రెండో సమావేశాన్ని అమరావతిలో నిర్వహించేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. ఫిబ్రవరి 1న బీజేపీయేతర పక్షాలతో ఢిల్లిలో సమావేశమై అమరావతి సభ తేదీని ఖరారు చేయనున్నారు.
ఈ సభ ఫిబ్రవరి 15వ తేదీలోగా నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ సభ ద్వారా అమరావతి కేంద్రంగా దేశ రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా కీలక కార్యాచరణ రూపొందిస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్రానికి సంబంధించి విభజన హామీలు, ప్రత్యేక హోదా అంశాలపై పార్లమెంట్ సమావేశాల చివరిరోజైన ఫిబ్రవరి 13న ఢిల్లిలో సిఎం చంద్ర బాబు ఒక రోజు నిరసన దీక్షకు దిగాలని ఇప్పటికే నిర్ణయించారు. ఈ దీక్ష ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని, చూపుతున్న వివక్షతను జాతీయ స్థాయిలో ప్రజల దృష్టికి తీసుకువెళ్లే లక్ష్యంతో కార్యాచరణ రూపొందించారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో పాటు ఎన్సిపీ అధినేత శరద్‌పవార్, జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రులు ములాయం సింగ్ యాదవ్, అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, సీపీఎం, సీపీఐ జాతీయ నేతలతో సమావేశమై ఇప్పటికే వారి మద్దతును కూడ గట్టారు సిఎం చంద్రబాబు. అధికార ఎన్‌డిఏకు బలమైన ప్రత్యామ్నాయంగా అన్ని రాజకీయ పక్షాలతో కలిసి ఉమ్మడి పోరుకు తెరతీశారు.
త్వరలో అమరావతిలో జాతీయ, ప్రాంతీయ పార్టీల నేత లతో సమావేశం ఏర్పాటు చేయడంతో పాటు, భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు . ఏదిఏమైనప్పటికీ బీజేపీని ఏకాకి చేసి, అధికారం నుంచి తప్పించాలనే లక్ష్యంగా అన్ని ప్రాంతీయ పార్టీల నేతలు అడుగులు వేస్తున్నారు వీరందరిని ఏకతాటిపై తీసుకు రావడంలో సిఎం చంద్రబాబు ఎంత వరకు సఫలీకృతం అవుతారనేది వేచి చూడాల్సిందే.