ప్రత్యేక హోదా కోసం ఏపి బంద్

AP Bandh
AP Bandh

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆంద్ర‌ప్ర‌దేశ్ లో బంద్ జ‌రిగింది. ప్రత్యేకహోదా, విభజన హామీల సాధన సమితి ఇచ్చిన పిలుపుతో పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయ‌కులు, కార్యకర్తలు రోడ్లపైకి చేరుకుని బంద్‌లో పాల్గొన్నారు. బంద్‌కు కాంగ్రెస్ , సీపీఐ, సీపీఎం పార్టీలతో పాటు ఉద్యోగ ప్రజా సంఘాలు ఈ బంద్‌కు మద్దతు ప్రకటించాయి.

అలాగే లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, విద్యాసంస్థలు బంద్‌కు సంఘీభావం తెలిపాయి. ఈ బంద్‌కు ఆర్టీసీ కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. టీడీపీ కార్యకర్తలు ర్యాలీలు, నిరసన ప్రదర్శనల్లో నల్ల బ్యాడ్జీలతో పాల్గొన్నారు. బంద్‌కు ఏపీఎన్జీవో సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. విశాఖలోని మద్దిలపాలెం జంక్షన్‌లో వామపక్షాలు, విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి.

రైల్వేజోన్‌, ప్రత్యేక హోదా కోరుతూ చేపట్టిన ఈ బంద్‌కు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరుతూ నినాదాలు చేశారు . విజయవాడలోని జవహర్‌లాల్‌ నెహ్రూ బస్టాండ్‌ ఎదుట హోదా సాధన సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో పాటు పలువురు సీపీఐ నేతలు నిరసనకు దిగారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సు సేవలు నిలిచిపోయాయి. బంద్‌కు బిజేపి , వైసిపి, జనసేన దూరంగా ఉన్నాయి.