ప‌డి ప‌డి లేచె మ‌న‌సు

ప్రేమ‌క‌ల్లో సంఘ‌ర్ష‌ణ కీల‌కం. ద‌ర్శ‌కుడు కూడా ఆ విష‌యంపైనే ప్ర‌ధానంగా దృష్టిపెట్టాడు. కానీ అదే ఈ క‌థ‌కి అత‌క‌లేదు. ప్రేమ‌జంట‌కి స‌మ‌స్య‌లు వేరొక‌వైపు నుంచి వ‌చ్చిన‌ప్పుడే స‌న్నివేశాలు బాగా పండుతాయి. కానీ ఇక్క‌డ మాత్రం వాళ్ల‌కి ప్రేమ‌కి వాళ్లే శ‌త్రువులుగా మార‌తారు. వాళ్ల‌కి వాళ్లే చిక్కులు కొని తెచ్చుకుంటారు. అందులోనే త‌న మార్క్ క‌వితాత్మ‌క‌త క‌నిపిస్తుంద‌నుకున్నాడు ద‌ర్శ‌కుడు. కానీ ఆ కాన్‌ఫ్లిక్టే పండ‌క‌పోయేస‌రికి సినిమా ఆద్యంతం బోరింగ్‌గా సాగుతున్న‌ట్టు అనిపిస్తుంది. ప్ర‌థ‌మార్థం వ‌ర‌కు సినిమా బాగానే ఉంద‌నిపిస్తుంది.

కానీ విరామం స‌మ‌యానికి వ‌చ్చేస‌రికి వ్య‌వ‌హారం మ‌రీ సిల్లీగా మారిపోతుంది. ఓ చిన్న కార‌ణానికే ప్రేమికులు విడిపోతారు. అప్ప‌టిదాకా ప్రేమించిన కుర్రాడు పెళ్లి ద‌గ్గ‌రికి వ‌చ్చేస‌రికి నో చెబుతాడు. అందుకు కార‌ణం త‌నఇంట్లో చూసిన వాతావ‌ర‌ణ‌మే. కానీ ఆ మాత్రం దానికే అప్పుడే ప్రేమ‌లో ప‌డిన జంట విడిపోతుందా? అనే అనుమానాలు ప్రేక్ష‌కుల్లో కలుగుతాయి. విరామానికి ముందు స‌న్నివేశాల్లో భూకంపం కాన్సెప్ట్‌ని బాగా వాడుకొన్నాడు. అది క‌థ‌కి మంచి మ‌లుపే. కానీ ఆ త‌ర్వాత స‌న్నివేశాలే గాడిత‌ప్పాయి. మెమ‌రీ లాస్ అంటూ ఓ కొత్త డిజార్డ‌ర్ నేప‌థ్యాన్ని తీసుకొన్నాడు ద‌ర్శ‌కుడు. దాన్ని కూడా అర్థ‌మ‌య్యేలా చెప్ప‌లేక‌పోయారు.

మొద‌ట అబ‌ద్ధంతో మొద‌లైన ప్రేమ‌క‌థ‌.. ద్వితీయార్థంలోకి వ‌చ్చేస‌రికి ఏది అబ‌ద్ధ‌మో, ఏది నిజ‌మో… అర్థం కాని ప‌రిస్థితికొస్తుంది. `కృష్ణ‌గాడి వీర‌ప్రేమ‌గాథ‌`లో బాగా న‌వ్వించిన హ‌ను, ఇందులో కామెడీ ప‌రంగా కూడాత‌న ప‌నిత‌నం ప్ర‌ద‌ర్శించ‌లేక‌పోయారు. ఎంతో మ‌నసు పెడితే త‌ప్ప హాస్య స‌న్నివేశాలు కూడా అర్థం కావు. ఆరంభంలో ప‌ర్వాలేద‌నిపించినా… చివ‌రికొచ్చేస‌రికి గంద‌ర‌గోళంగా ముగుస్తుంది.