ఎన్నిక‌ల నామ సంవ‌త్స‌రంలో నారా వ‌ర్సెస్ మోదీ

Nara versus Narendra Modi in election year
Nara versus Narendra Modi in election year

కొత్త ఏడాది ప్రారంభంలోనే మాట‌ల తూటాలు పేలాయి. కూట‌మి టార్గెట్ గా ప‌ర‌స్ప‌రం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసుకున్నారు ఇటు నారా చంద్ర‌బాబు…అటు న‌రేంద్ర‌మోదీ. ఎన్నిక‌ల ఏడాదికి తొలిరోజే మాట‌ల‌కు ప‌దును పెట్టారు. బీజేపీయేతర కూటమి పేరుతో చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ వ్యాఖ్యానించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఇదే వ్యూహంతో ముందుకెళ్లిన ఏపీ సీఎం ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నారని మోడీ అన్నారు. ఏపీ సీఎం కూటమి ప్రజల కోసం కాదని, మోడీని ఓడించడం అన్నదే వారి అజెండా అని మోడీ అన్నారు . తెలంగాణలో ఆ కూటమికి తొలి పరాభవం ఎదురైందని కామెంట్ చేశారు. . వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీయేతో ఏ పార్టీలు ఉంటాయి, ఏ పార్టీలు ఉండవు అన్న సంగతి తానిప్పుడే చెప్పలేనని మోడీ స్ప‌ష్టం చేశారు.

ఇంతేగాక దేశంలో బీజేపీయేతర, కాంగ్రెస్ యేతర పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సంగతి తనకు తెలియదని ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు.

ఇటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో మహాకూటమి విఫలమైందన్న మోడీ వ్యాఖ్యలను ఏపీ సీఎం చంద్రబాబు ఖండించారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోడీపై ఫైర్ అయ్యారు. తెలంగాణలో కేసీఆర్ విజయం సాధిస్తే… ఆయనకు ఎందుకు అంత ఆనందం అని ప్రశ్నించారు. జనం అన్నీ గమనిస్తున్నారని చెప్పారు.

దేశాన్ని రక్షించుకోవడం కోసమే కాంగ్రెస్ తో కలిసినట్లు స్పష్టం చేశారు. మోడీ తన చాతకాని నిర్వాకంతో దేశాన్ని శిథిలం చేస్తున్నారని విమర్శించారు. ఏపీలో బలహీన ప్రభుత్వం ఉంటేనే తమ ఆటలు సాగుతాయని మోడీ, కేసీఆర్ భావిస్తున్నారని చంద్రబాబు అన్నారు. నాలుగున్నరేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. దేశ ప్రజలను మోదీ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని నిప్పులు చెరిగారు. బలహీనుల్ని అధికారంలోకి తెచ్చి రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవాలన్నదే ఆయన ధ్యేయమని, సుస్థిర ప్రభుత్వం రాకూడదని, సామంత రాజులు రావాలని చూస్తున్నారని మోదీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మ‌రో రెండు నెల‌ల్లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రానున్న నేప‌ధ్యంలో ప్ర‌ధాని వ‌ర్సెస్ ముఖ్య‌మంత్రి మాట‌ల యుద్దం మ‌రింత ముద‌ర‌నుంది.