హ‌స్తిన‌లో మోదీని టార్గెట్ చేసిన ఏపి సిఎం చంద్ర‌బాబు

Modi-Naidu
Modi-Naidu

విభజన చట్టం అమలులో కేంద్రం విఫలమైందని విమర్శించారు ఏపి సిఎం చంద్ర‌బాబు. తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు 12 గంటల హ‌స్తిన‌ దీక్షకు జాతీయ నేతలు మద్దతు ప్ర‌క‌టించారు. పాలించే వ్యక్తులు ధర్మం తప్పినప్పుడు, ఒక రాష్ట్రం పట్ల, ప్రాంతం పట్ల వివక్ష చూపినప్పుడు పోరాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు సిఎం చంద్రబాబు. ఏపీకి ప్రత్యేక హోదా. విభజన హామీల అమలు విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు నిరంకుశంగా ఉందన్నారు ఆయ‌న‌. గుంటూరు వేదికగా మోడీ తనపై చేసిన వ్యక్తిగత విమర్శలు ఆయన హోదాని తగ్గించాయన్నారు.

ఏపీకి చేసిన అన్యాయానికి రాష్ట్ర ప్రజలకు మోడీ క్షమాపణ చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. మూడు రోజుల్లోగా క్షమాపణ చెప్పకుంటే ప్రజలు క్షమించరని హెచ్చరించారు. ఏపీకి అన్యాయం, ద్రోహం చేసిన నరేంద్రమోడీ త‌న‌ని లెక్కలు అడుగుతున్నారని, తాను లెక్కలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నానన్నారు సిఎం చంద్ర‌బాబు. అయితే కేంద్రానికి తాము కట్టిన పన్నులకు మోదీ లెక్కలు చెప్పగలరా అని సవాల్ చేశారు.

దేశ ప్రధాని హోదాలో ఇచ్చన హామీని నిలబెట్టుకుని తీరుతారని ఎవరైనా భావిస్తారనీ, అయితే మోడీ హామీని నిలబెట్టుకోలేదని, ఆయన ఏం ప్రధాని అని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ఏపి సిఎం చంద్రబాబు దీక్షా వేదికపై నుంచి ఆయన మాట్లాడుతూ…మోడీ ఎక్కడకు వెళితే అక్కడ అబద్ధాలు చెబుతున్నారన్నారు.

ఏపీ విషయంలో ఆయన వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాల్సిన సొమ్ములను ఎగ్గొట్టి వాటిని తన మిత్రుడు అనిల్ అంబానీకి ఇచ్చారన్నారు రాహుల్ . ప్ర‌త్యేక హోదా కోరుతూ ఆత్మహత్య చేసుకున్న దివ్వెల అర్జునరావు మరణ వార్తను సీఎం చంద్రబాబు వేదికపై ప్రకటించారు. దివ్వెల అర్జునరావు మృతికి సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. అర్జునరావు మృతికి సీఎం చంద్రబాబు, నేతలు నివాళులర్పించారు. ఇంకా ప‌లువురు జాతీయ నేత‌లు, ప్రాంతీయ పార్టీల నాయ‌కులు చంద్రబాబు దీక్ష‌కు మ‌ద్ద‌తు తెలిపారు.