ద‌మ్ముంటే తేల్చుకుందాం రా – మోదీకి రాహుల్ స‌వాల్

modi,rahul

రాఫెల్ యుద్ద విమానాల ఒప్పందం అంశం మ‌రోసారి లోక్‌సభను కుదిపేసింది. పారిశ్రామిక వేత్త అనీల్ అంబానీకి ప్రయోజనం కల్పించేందుకే రాఫెల్ డీల్‌లో మార్పులు చేశారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు.రాఫెల్ డీల్‌ను తొలి నుంచి ప్రచారాస్త్రంగా వాడుతూ బీజేపీని ఇరుకున పెడుతున్నారు రాహుల్. లొక్ స‌భ సాక్షిగా అధికార ప‌క్షంపై రాహుల్ విరుచుకుప‌డ్డారు.స‌భ బ‌య‌ట శీత‌ల‌గాలులు వ‌ణుకు పుట్టిస్తుంటే..స‌భ లోప‌ల రాఫెల్ ర‌గ‌డ అధికార‌, విన‌క్ష ప‌భ్యుల మ‌ధ్య మ‌రింత అగ్గిని రాజేసింది.ఈ నేప‌ధ్యంలో అసలు యుద్ధ విమానం అంటే ఏమిటో తెలియదంటూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఎదురుదాడికి దిగారు.

రాఫెల్ ఒప్పందంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని.. కొందరు సహజంగా నిజాలను ఇష్టపడరని జైట్లీ విమర్శించారు. డబ్బుకు సంబంధించిన విషయాలను బాగా అర్థం చేసుకుంటారు కానీ, జాతీయ భద్రతకు సంబంధించిన విషయాలను మాత్రం అర్థం చేసుకోలేరని జైట్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసు, అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కుంభకోణంతోపాటు.. బోఫోర్స్‌ కుంభకోణంలో దళారిగా వ్యవహరించిన ఖత్రోచీ పేరును ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. రక్షణ కుంభకోణాల్లోని కుట్రదారులు మోదీని విమర్శిస్తున్నారని.. యుద్ధ విమానం గురించి కూడా తెలియని వ్యక్తి కాంగ్రెస్‌కు అధ్యక్షత వహిస్తున్నారంటూ జైట్లీ ఎద్దేవా చేశారు.

దీంతో హ‌స్తిన‌లో మీడియా స‌మావేశం ఏర్పాటు చేసిన రాహుల్ ..నరేంద్రమోదీకి సవాలు విసిరారు. రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై దమ్ముంటే తనతో చర్చకు రావాలన్నారు. కేవలం 20 నిమిషాలు తనతో చర్చలో కూర్చోవాలని సవాల్ చేశారు. మోదీతో తాను చర్చకు సిద్ద‌మ‌ని., త‌న‌కు కేవలం 20 నిమిషాల సమయం ఇవ్వండి చాలు.ముఖాముఖి చర్చించుకుంటే స్పష్టత వస్తుంద‌న్నారు. అయితే ప్రధానికి మాత్రం త‌న‌తో చర్చకు వచ్చే దమ్ము లేద‌ని వ్యాఖ్యానించారు రాహుల్. జేపీసీ వేయవద్దని కూడా సుప్రీం చెప్పలేద‌ని, వాస్తవాలు దేశానికి తెలియాల‌న్నారు. దేశానికి మోదీ కాపలాదారు కాద‌ని, సైన్యం పేరు చెప్పి, భావోద్వేగాలు ఎంతోకాలం రెచ్చగొట్టలేరని రాహుల్ వెల్ల‌డించారు.