మ‌హాకూట‌మి కాదు… మహా కల్తీ – ప్ర‌ధాని మోదీ కామెంట్స్

Modi in Lok Sabha
Modi in Lok Sabha

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలోక్‌స‌భ‌లో సుదీర్ఘంగా ప్రసంగించారు. తన ప్రభుత్వ విజయాలను వివరిస్తూనే, ప్రతిపక్షాలపై పదునైన విమర్శలు చేశారు .కాంగ్రెస్‌ పార్టీ అహంకారం వల్ల 400 ఎంపీ స్థానాలున్న పార్టీ 40 స్థానాలకు పడిపోయిందన్నారు. అదే రెండు స్థానాలున్న తమ పార్టీ పరిశ్రమతో 282 స్థానాలకు పెరిగిందని గుర్తు చేశారు. ప్రజాస్వామ్య విలువలను మంటగలిపి అరాచకాలకు పాల్పడేది కాంగ్రెస్ పార్టీనేన‌ని ధ్వ‌జ‌మెత్తారు.

కాంగ్రెస్‌ వాళ్లు నిజాలు చెప్పరని, వినరని, ఒప్పుకోరని వ్యాఖ్యానించారు మోదీ. ఇందిరాగాంధీ హయాంలో ఎన్నికైన ప్రభుత్వాలను రద్దుచేశారని, ఎమర్జెన్సీ విధించారని గుర్తు చేశారు. తాము వ్యవస్థలను నాశనం చేస్తున్నామన్న వాదనలో వాస్తవం లేదన్న విషయాన్ని గ్రహించాలన్నారు ఆయ‌న‌.నాటి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని కూల్చింది కాంగ్రెస్సేనని గుర్తు చేశారు. ఇవాళ అదే కాంగ్రెస్‌తో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర‌బాబు జట్టు కట్టి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

విపక్షాలది మహా కూటమి కాదని, అదొక మహా కల్తీ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివర్ణించారు. కల్తీ సర్కార్‌ ఎలా ఉంటుందో ప్రజలకిప్పటికే తెలుసున‌న్నారు. మరోసారి వారికి అవకాశం ఇవ్వరన్నారు. మళ్లీ తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ .