నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డిన లోక్‌స‌భ

Parliment
Parliment

పదహారవ లోక్‌సభ నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డింది. బడ్జెట్‌ను ఆమోదించేందుకు 13 రోజులపాటు సమావేశమైన లోక్‌సభకు బుధ‌వారం తెర ప‌డింది. ఈ లోక్ సభను 1,612 గంటలు అంటే 331 సిట్టింగ్ లు కొనసాగించారు. వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లు, ట్రిపుల్ తలాక్‌ను నిషేధించే బిల్లులను ఆమోదించకుండానే రాజ్యసభ వాయిదా పడింది . ఈ రెండు బిల్లులు ప్రస్తుత లోక్‌సభ గడువు ముగియనున్న జూన్ 3వ తేదీతో రద్దు కానున్నాయి.

రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లులు పెండింగ్‌లో ఉంటే లోక్‌సభ రద్దయినప్పటికీ అవి రద్దు కావు. కానీ లోక్‌సభలో ప్రవేశపెట్టి ఇక్కడ ఆమోదం పొందిన బిల్లులు రాజ్యసభలో పెండింగ్‌లో ఉంటే మాత్రం అవి రద్దయిపోతాయి.ఇక 16వ లోక్ సభ చివరి రోజు సమావేశం ముగింపు సందర్భంగా స్పీక‌ర్ సుమిత్రా మహాజన్ మాట్లాడారు.

ఈ ఐదేళ్లలో తాము ప్రాతినిధ్యం వహించిన నియోజక వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేశామా, లేదా అనే విషయమై ఎంపీలందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు ఆమె. పదహారవ లోక్ సభలో 205 చట్టాలు ఆమోదం పొందడంపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు.లోక్ సభలో సభ్యుల గందరగోళాల కారణంతో జూన్ 2014 నుంచి బుధ‌వారం వరకు 422 గంటల 19 నిమిషాలు వృథా అయ్యాయని వెల్ల‌డించారు స్పీక‌ర్‌.