కాంగ్రెస్‌కు కోట్ల కుటుంబం క‌టీఫ్ ..!

K Jaya Surya Prakash Reddy
29/10/2012 - NEW DELHI: K Jaya Surya Prakash Reddy taking charge as the Minister of State for Railways, in New Delhi on Monday - PTI Photo. [Delhi, Kotla Jaya Surya Prakash Reddy, Kotla Surya Prakash Reddy, mug shot]

ఏపి రాజ‌కీయాలు ఊపందుకున్నాయి. నిన్న‌టికి నిన్న ద‌గ్గుబాటి కుటుంబం వైసిపి బాట ప‌ట్ట‌గా, ఇవాళ కోట్ల కుటుంబం సైకిల్ ఎక్కేందుకు సిద్ద‌మైంది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప‌రిస్థితి మ‌రింత దిగ‌జారి పోయింది. క‌ర్నూలు జిల్లాలో కోట్ల కుటుంబం అనాదిగా కాంగ్రెస్ తో బంధాన్ని పెన‌వేసుకుపోయింది. దశాబ్దాల బంధాన్ని తెంచుకునే దిశగా సీనియర్‌ నేత, మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్‌రెడ్డి తనయుడు, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశరెడ్డి మరో అడుగు ముందుకేశారు .

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానం మేరకు ఆయన తన భార్య, డోన్‌ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, కుమారుడు రాఘవేంద్రరెడ్డి, సోదరుడు గిరిధర్‌రెడ్డిలతో కలిసి ఉండవల్లిలోముఖ్య‌మంత్రి చంత్ర‌బాబుతో స‌మావేశం అయ్యారు.ఆయ‌న‌తో కలసి భోజనం చేశారు. తనకు కర్నూలు లోక్‌సభ స్థానం, తన భార్యకు డోన్‌, తన కుమారుడికి ఆలూరు అసెంబ్లీ స్థానాలను ఆయన అడిగినట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. ప్రస్తుతం కర్నూలు ఎంపీగా ఉన్న బుట్టా రేణుకను రాజ్యసభకు పంపితే.. కర్నూలు లోక్‌సభ స్థానాన్ని కోట్లకు కేటాయించడానికి అభ్యంతరం ఉండదని స‌మాలోచ‌న‌లు చేస్తున్నారు.

క‌ర్నూలు. జిల్లాలో సీనియర్‌ నేత, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తితోనూ సంప్రదింపులు జరిపాక నిర్ణయం ప్రకటించడం మంచిదని సీఎం భావిస్తున్న‌ట్లు స‌మాచారం.ఇప్ప‌టికే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి మద్దతుగా జిల్లా కాంగ్రెస్ యువ నేతలు ఆ పార్టీకి రాజీనామాలు చేశారు.కర్నూలు జిల్లా రాజకీయాల్లో కోట్ల, కేఈ కుటుంబాలే ప్రధానంగా ప్రభావం చూపుతుంటాయి. ఈ రెండు కుటుంబాల మధ్య నాలుగు దశాబ్ధాల నుంచి తీవ్ర‌మైన‌ పోటీ ఉండేది. ఒక‌ప్పుడు కోట్ల, కేఈ కుటుంబాలు కాంగ్రెస్‌లోనే ఉండేవి. కేఈ కుటుంబం తెలుగుదేశంలో చేరాక ఆధిపత్య పోరు సాగింది.

కోట్ల, కేఈ కుటుంబాలు రెండు టీడీపీలో ఉండడం వల్ల జిల్లాలోని ఏడు నియోజకవర్గాలు పార్టీకి సానుకూల ఫలితాలు చూపుతాయని తెలుగుదేశం నేతలు అంచనా వేస్తున్నారు . రెడ్డి, బీసీ కలయికతో జిల్లాలో పార్టీ తిరుగులేని విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు లెక్క‌లు వేస్తున్నారు. రాయలసీమలో ఇప్పటి వరకు కొంత బలహీనంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కోట్ల చేరికతో పుంజుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ దిశగా పావులు కదుపుతున్నారు.