అన్నా హజారే మ‌ళ్లీ ఎందుకు దీక్ష‌కు దిగారు ..?

Anna Hazare
Anna Hazare

సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే మరోసారి నిరాహార దీక్షకు దిగారు. లోక్‌పాల్‌, లోకాయుక్త నియామకాల్లో జాప్యాన్ని నిరసిస్తూ మహారాష్ట్రలోని ఆయన స్వగ్రామం రాలేగావ్‌ సిద్ధిలో నిరాహార దీక్ష చేపట్టారు. లోక్‌పాల్‌ బిల్లు 2013లోనే పార్లమెంట్‌లో ఆమోదం పొందిన‌ప్ప‌టికీ, ఇంతవరకూ లోక్‌పాల్‌, లోకాయుక్తలను నియమించలేద‌న్నారు ఆయ‌న‌. అసలు ఏ పార్టీ దీని గురించి పట్టించుకోవట్లేద‌ని హజారే అసహనం వ్యక్తం చేశారు.

కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు ఎన్నికలకు ముందు అవినీతిని అంతం చేసేందుకు లోక్ పాల్, లోకాయుక్త వ్యవస్ధలను ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశాయని అన్నారు. ఆ వాగ్దానాలు సాకారం చేయాలని, రైతుల సమస్యలు పరిష్కరించాలని అన్నా హజారే డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని లోకాయుక్త పరిధిలోకి తీసుకురావాలని మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. లోక్‌పాల్‌, లోకాయుక్తలను ఏర్పాటుచేసే వరకూ నిరాహార దీక్ష విరమించబోనని ఆయ‌న స్పష్టం చేశారు.