జెర్సీ రివ్యూ

Jersey Movie Review in Telugu
Jersey Movie Review in Telugu

నటీనటులు : నాని, శ్రద్ధ శ్రీనాథ్, సత్యరాజ్, రావు రమేష్
దర్శకత్వం : గౌతమ్ తిన్ననూరి
నిర్మాత : సూర్యదేవర నాగ వంశీ
సంగీతం : అనిరుద్ రవిచందర్
సినిమాటోగ్రఫర్ : సను వర్గీస్
ఎడిటర్ : నవిన్ నూలి
విడుదల తేదీ : ఏప్రిల్ 19, 2019
రేటింగ్ : 3.5/5

నేచురల్ స్టార్ నాని మంచి నటుడే అయినా కూడా ఈ మధ్య వరుసగా రొటీన్ సినిమాలు చేస్తూ ఫ్లాపులు అందుకున్నాడు.దాంతో రియలైజ్ అయ్యి టోటల్ గా డిఫరెంట్ అటెంప్ట్ కి రెడీ అయ్యి జెర్సీ సినిమా చేసాడు.ట్రైలర్ తోనే ఎమోషనల్ రోలర్ కోస్టర్ లా కనిపించిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించి నాని ఆశించిన హిట్ ఇచ్చిందా? లేక నిరాశపరిచిందా అనేది ఇప్పడు చూద్దాం.

కథ: అర్జున్ (నాని) ఇండియన్ క్రికెట్ జట్టులో ఆడాలని కలలు కంటూ ఉంటాడు.ఒక పక్క క్రికెట్,మరో పక్క సారా తో ప్రేమ మాత్రమే అర్జున్ గోల్స్.కానీ సారా తో పెళ్లవ్వగానే బాధ్యతలు పెరగడంతో 26 ఏళ్ల వయసులో క్రికెట్ ని వదిలేస్తాడు. ఓ ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్ అయి నార్మల్ లైఫ్‌ని లీడ్ చేస్తూ ఉంటాడు.అర్జున్, సారాలకు నాని అనే కొడుకు పుడతాడు. కొంత కాలానికి అర్జున్ ఉద్యోగం నుండి సస్పెండ్ అవుతాడు.దాంతో ఏ పనీపాటా లేకుండా ఇంట్లో ఖాళీగా ఉంటూ.. కనీసం కొడుకు బర్త్ డే రోజు అడిగిన గిఫ్ట్(జెర్సీ) కూడా కొనివ్వలేకపోతాడు.ఇలా అన్నింటిని భరిస్తూ ఉన్న అర్జున్.. కొడుక్కి తనో హీరోలా కనబడడానికి ఆపేసిన క్రికెట్‌ను మళ్లీ మొదలుపెట్టాలనుకుంటాడు. అసలు అర్జున్ క్రికెట్‌ను ఎందుకు వదిలేయాల్సి వచ్చింది,లేట్ వయసులో మళ్ళీ క్రికెటర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అర్జున్ అనుకున్నది సాధించాడా?,కొడుకు దృష్టిలో హీరోగా మిగిలాడా? లేదా అన్నదే జెర్సీ కథ.

నటీనటులు: అర్జున్ పాత్రలో తనని తప్ప మరొకరిని ఊహించుకోడానికి కూడా అవకాశం లేని విధంగా ఆ పాత్రను స్క్రీన్ పై సజీవంగా నిలిపాడు నాని.క్రికెటర్ గా ప్రొఫెషనలిజం చూపించడానికి 70 రోజులపాటు ప్రాక్టీస్ చేసాడు.దాంతో క్రికెటర్ గానూ,లైఫ్ లో ఫెయిల్ అయిన ఫ్యామిలీ పర్సన్‌గానూ నటించి మెప్పించాడు.నాని కొడుకుగా నటించిన రోనక్ ఆ పాత్రకి ప్రాణం పోసాడు.దాంతో జెర్సీ కి అతికీలకమయిన తండ్రి కొడుకుల థ్రెడ్ అన్ని అవతారాలను దాటే బలం సంపాదించుకుంది. ఇక సారా పాత్రలో శ్రద్దా శ్రీనాథ్ కూడా చాలా సహజంగా నటించింది.ఆమె హావభావాలు కూడా ఆకట్టుకున్నాయి.లవర్ గా కాస్త రొమాంటిక్ గా.. భార్యగా మెచ్యూర్డ్ గా రెండు షేడ్స్ లోను మెప్పించింది.కోచ్‌గా, స్నేహితుడిగా అర్జున్ పక్కనే ఉండి నడిపించే కట్టప్ప సత్య రాజ్.. తన పాత్రకు న్యాయం చేశాడు. నాని స్నేహితులుగా నటించిన వారు తమ పరిధి మేరకు పర్వాలేదనిపించారు.ప్రవీణ్ డైలాగ్స్ కాస్త కామెడీ పంచాయి.మనిషి కష్టాలు పడుతూ.. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ.. చివరికి సక్సెస్ అవ్వడం.. ఈ తరహా కథలు గతంలో చాలా వచ్చాయి.కానీ ఈ కథకు క్రికెట్ నేపథ్యం ఎంచుకోవడం, ఆ పాత్రలో నాని విశ్వరూపం చూపించడం, గౌతమ్ తిన్ననూరి తన టాలెంట్‌తో కథను నడిపించిన తీరే ఈ సినిమాను నిలబెట్టాయి.డెబ్బై రోజుల నాని కష్టం.. తెరపై స్పష్టంగా కనిపిస్తుంది.

టెక్నీషియన్స్: గౌతమ్ తిన్ననూరి తాను నమ్మిన పాయింట్ పై ఫుల్ ప్లెడ్జెడ్ గా ఎంత వర్క్ చెయ్యొచ్చొ అంతా చేసాడు.అందుకే రైటర్ గాను,డైరెక్టర్ గాను ఫుల్ కమాండ్ చూపించి తాను అనుకున్న అవుట్ ఫుట్ ని అదే విధంగా తెరపైకి తీసుకురాగలిగాడు.ఇక అతని స్క్రీన్ ప్లే సెన్సిబిలిటీస్ కూడా సినిమాకి ప్లస్ అయ్యాయి.గౌతమ్ డీల్ చేసిన సెంటిమెంట్ థ్రెడ్ కి సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి చాలా చోట్ల కళ్ళలో నీళ్లు తిరుగుతాయి.కాకపోతే సింగిల్ పాయింట్ స్టోరీ కావడం,ప్రతి విషయాన్ని మాటలతో కాకుండా విజువల్ లోనే చూపించాలనే క్రమంలో ఫస్టాఫ్ కాస్త లెంగ్తీ గానూ, స్లో గానూ నడిచినట్టు అనిపిస్తుంది.సెకండాఫ్‌లో వేగం పెరిగింది.అలాగే పూర్తిగా క్రికెట్ నేపథ్యంలో సాగింది.గౌతమ్ ఊహించుకున్న విజువల్స్ ని యాస్ ఇట్ ఈజ్ గా తన కెమెరా కంటితో వెండితెరపైకి ట్రాన్స్ లేట్ చేసాడు సినిమాటోగ్రాఫర్ సాను వర్గీస్.ముఖ్యంగా క్రికెట్ మ్యాచెస్ తాలూకు విజువల్స్ ని చాలా రియలిస్టిక్ గా తెరకెక్కించాడు.అలాగే అజ్ఞాతవాసి సినిమాతో ఫెయిల్ అయిన అనిరుధ్ ఈ సినిమాకి మాత్రం తన నేపధ్య సంగీతంతో బలంగా నిలిచాడు.నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు చేసాడు.

ఫైనల్ గా : రొటీన్ సినిమాలు,కమర్షియల్ సినిమాల మధ్యలో వచ్చిన స్వచ్చమయిన సినిమా జెర్సీ.ఎమోషన్ కి ఎలాంటి బలం ఉంటుంది?,ఒక కథను యూనిట్ అంతా కలిసి నమ్మితే వచ్చే అవుట్ ఫుట్ ఎలా ఉంటుంది? లాంటి ప్రశ్నలకు ఆన్సర్ జెర్సీ.ఎమోషన్ ఓవర్ డోస్ అన్నా,సినిమా స్లో గా ఉంది అన్నా…ఇతరత్రా కంప్లైంట్స్ ఏమున్నా కూడా క్లయిమాక్స్ లో వచ్చే ట్విస్ట్ చూసాక మాత్రం అవేమీ గుర్తుండవు.మంచి సినిమా చుసిన అనుభూతి మాత్రమే మిగులుతుంది.టాక్ పరంగా తిరుగులేని ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తుంది అన్నది మాత్రం ఇప్పుడే చెప్పడం కష్టం.

బోటమ్ లైన్:జెర్సీ…మెరిసింది.