కర్నాటకలో సీట్ల సర్థుబాటు కొలిక్కి వచ్చేనా..!

JDS
JDS

సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో కర్ణాటక రాజకీయాలు వేడెక్కాయి. కేంద్రంలోని బిజేపి ఓటమే లక్ష్యంగా మిత్రపక్షాలు అడుగులు వేస్తున్నాయి. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్, జేడీఎస్.. లోక్సభ ఎన్నికల్లోనూ కలిసే పోటీ చేస్తున్నాయి. సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఇవాళ జేడీఎస్ నేత, మాజీ ప్రధాని దేవెగౌడను కలిశారు. దిల్లీలోని దేవెగౌడ నివాసానికి చేరుకున్న రాహుల్ సీట్ల పంపకాలపై ఆయనతో కలసి కసరత్తు చేశారు.

కర్ణాటకలో మొత్తం 28 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. పొత్తులో భాగంగా తమకు 12 సీట్లు కావాలని జేడీఎస్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. వీటిలో నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీలు ఉన్నట్లు తెలిసింది. దీనివల్ల స్థానిక కాంగ్రెస్ నేతలు కాస్త గుర్రుగా వున్నట్లు సమాచారం. సీట్ల సర్దుబాటపై జేడీఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఇప్పటికే రెండు సార్లు చర్చలు జరిగాయి. దీంతో ఇవాళ రాహుల్, దేవెగౌడ సమావేశంతో సీట్ల పంపకాలు విషయంలో కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.

లోక్సభ ఎన్నికల్లో కర్ణాటకలోని 28 స్థానాలకు గాను 10 సీట్లను తమకు కేటాయించాలని జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ కాంగ్రెస్ను కోరారు. సమావేశం అనంతరం దేవెగౌడ మీడియాతో మాట్లాడుతూ కర్ణాటకలో సీట్ల పంపకంపై చర్చించామన్నారు. కర్ణాటకలో మూడింట రెండొంతుల స్థానాల్లో కాంగ్రెస్.. మిగిలిన చోట్ల జేడీఎస్ పోటీ చేస్తుందన్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్, జేడీఎస్ జాతీయ కార్యదర్శి ధనిష్ అలీ పాల్గొన్నారు.